
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రిమండలి తాజా నిర్ణయంతో.. 30 ఏళ్లుగా అమల్లో ఉన్న నిబంధనకు బ్రేక్ పడనుంది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీరాజ్ సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ 1994లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం 1995 మే 31 నుంచి అమల్లోకి వచ్చింది. గత ఏడాది నవంబరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తివేసింది. గత సంవత్సరం డిసెంబరులో దీన్ని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా నిర్ణయించగా.. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించారు. అయితే, తెలంగాణలో సంతానోత్పత్తి రేటుపై శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయనే కారణంతో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారిని పోటీకి అనుమతించేందుకు మంత్రిమండలి నిరాకరించింది. ఇటీవల స్థానిక ఎన్నికల సందడి నేపథ్యంలో నిబంధన ఎత్తివేత కోసం మళ్లీ వినతులు వస్తున్నాయి. దీంతో తాజాగా మంత్రిమండలి ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇలా ప్రక్రియ..: మంత్రిమండలి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు.. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఈ నిబంధన ఎత్తివేతకు అనుసరించిన విధానాన్ని అధ్యయనం చేస్తారు. అనంతరం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. మంత్రిమండలి సమావేశంలో దీన్ని ప్రవేశపెడతారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే అనర్హులనే నిబంధన ఎత్తివేత కోసం పంచాయతీరాజ్ చట్ట సవరణకు నిర్ణయం తీసుకుంటారు. శాసనసభ సమావేశాలు ఇప్పట్లో లేనందున ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అది గవర్నర్ ఆమోదం పొందితే అమల్లోకి వస్తుంది.ఎన్నికలు ఆలస్యమైతేనే..: ఈ నెల 23న జరిగే మంత్రిమండలి సమావేశంలో స్థానిక ఎన్నికలను పాత రిజర్వేషన్లతో వెంటనే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పక్షంలో ఆ మేరకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమయం ఎక్కువగా ఉండదు కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు సాధ్యం కాదని.. పాత నిబంధనతోనే ఎన్నికలు జరుగుతాయని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికలు ఆలస్యమైతేనే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నాయి.