
{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18}మక్తల్
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు సుందరీకరణ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు స్థానిక పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ ని ఆహ్వానించకుండా ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గవినోళ్ల బలరాం రెడ్డి డిమాండ్ చేశారు.
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని మక్తల్ పెద్ద చెరువు దగ్గర ఏర్పాటు చేసే పబ్లిక్ పార్క్ ను స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ అక్కడ నిర్మించే లాడ్జింగ్, వాణిజ్య సముదాయము, సులబ్ కాంప్లెక్స్ ఏర్పాటును భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని అన్నారు. గతంలో ఇక్కడ పార్కు ఏర్పాటు చేయాలని మక్తల్ పురపాలక సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్రంలో ఎక్కడైనా పార్కు ప్రదేశంలో లాడ్జింగ్, వాణిజ్య సముదాయం, సులబ్ కాంప్లెక్స్ ఉంటుందా అని ప్రశ్నించారు. ఇవన్నీ ఏర్పాటు చేస్తే ప్రజలు కుటుంబాలతో పార్కుకు ఎలా వస్తారని ప్రశ్నించారు. పెద్ద చెరువు లోపల శాశ్వత నిర్మాణాలు చేయడానికి ఇరిగేషన్ అధికారులు NOC ఏ విధంగా ఇచ్చారని అన్నారు. అదేవిధంగా NHAI అధికారులు NOC ఏ విధంగా ఇస్తారని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు బఫర్ జోన్ లు చూడకుండా బిల్డింగ్ పర్మిషన్ ఏ విధంగా ఇస్తారని అన్నారు. బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే చెరువు కట్ట బండ్ నుండి దాదాపు పది మీటర్ల తరువాత నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని అన్నారు అధికారులు ఇవేమీ చూడకుండా మట్టితో నింపిన చెరువులో నిర్మాణాలకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో వివరణ ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే మురుగునీరు చెరువులోకి వెళ్లి నీళ్లు కలుషితమవుతాయని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాల్సిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తే మీరు ప్రజలకు ఏ విధంగా జవాబు దారి అవుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా చట్టం తీసుకువస్తే సాక్షాత్తు ఇద్దరు మంత్రుల సాక్షిగా అధికారులు హైడ్రా చట్టాన్నిఉల్లంఘించారని అన్నారు. నిజంగా వాణిజ్య సముదాయాల నుండి మున్సిపాలిటీకి ఆదాయం రావాలంటే పట్టణంలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని అన్నారు. ఇక్కడి అధికారులు ఈ నిర్మాణాల విషయంలో నిబంధనలు పాటించకపోతే ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నల్లే నరసప్ప, చంద్రశేఖర్ గౌడ్ జిల్లా నాయకులు కనకరాజు, వాకిటి మల్లేష్, సత్యనారాయణ, రాజశేఖర్, నరసింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జనార్ధన్, తిమ్మప్ప, సురేష్ లింగం తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే బిసి Jac బంద్ కు సంపూర్ణ మద్దతు: బిజెపి రేపు జరగబోయే బీసీ జేఏసీ బందుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుందని తెలియజేశారు.