వన మహోత్సవం–2026లో భాగంగా తానూర్ పోలీస్ స్టేషన్‌లో మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్

July 22, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: వార్షిక తనిఖీ నిర్వహించి సరిహద్దు భద్రత, నేర నియంత్రణ, కమ్యూనిటీ పోలీసింగ్‌పై అధికారులకు దిశానిర్దేశంవన మహోత్సవం–2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ముధోల్ సర్కిల్ పరిధిలోని తానూర్ పోలీస్ స్టేషన్‌కు విచ్చేసిన నిర్మల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ కు పోలీసు అధికారులు పూల మొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసు గార్డ్ ద్వారా జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం తానూర్ పాఠశాల విద్యార్థులతో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని సుమారు 300 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని పెంచి సంరక్షించినప్పుడే వన మహోత్సవం లక్ష్యం సార్థకమవుతుందని తెలిపారు.అనంతరం తానూర్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ, స్టేషన్ పరిపాలన, శాంతిభద్రతల నిర్వహణ, నేర నియంత్రణ చర్యలు, రికార్డుల నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, బీట్ వ్యవస్థ, సీసీ కెమెరాల పనితీరు, మాల్ఖానా, ఆయుధాగారం, పోలీసు వాహనాలు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసమే పోలీసు శాఖకు అతిపెద్ద బలమని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదుదారునికి మర్యాదపూర్వకంగా స్పందిస్తూ సత్వర, పారదర్శక, నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రతి పోలీసు అధికారి కట్టుబడి ఉండాలని సూచించారు.ముధోల్ సర్కిల్ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న తానూర్ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేక వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని పేర్కొంటూ, అంతర్‌రాష్ట్ర నేరాల నియంత్రణకు మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన వాహన తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే మహారాష్ట్ర పోలీసులతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి అంతర్‌రాష్ట్ర నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బాల్య వివాహాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నాణ్యమైన దర్యాప్తు చేపట్టడంతో పాటు న్యాయస్థానాల్లో శిక్షల శాతం పెరిగేలా దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచాలని తెలిపారు.అదేవిధంగా గంజాయి, గుడుంబా, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో 5S విధానం, పరిశుభ్రత, క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ ప్రజలకు మరింత నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, ముధోల్ సీఐ రవీంద్ర నాయక్, తానూర్ ఎస్‌ఐ షేక్ జుబేర్ ఖాన్, తానూర్ పాఠశాల విద్యార్థులు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper