
పయనించే సూర్యుడు న్యూస్ :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అణ్వాయుధాలను చురుకుగా పరీక్షిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉందన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, మరియు పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాలు ఇటీవల పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొంటూ.. అమెరికా కూడా తిరిగి తన సొంత అణు పరీక్షలను ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఇతర దేశాలు పరీక్షలు కొనసాగిస్తున్నప్పుడు, అమెరికా మాత్రమే పరీక్షలను నిలిపిన ఏకైక దేశంగా ఉండకూడదని ఆయన వాదించారు. ఏ ఇతర దేశం కంటే అమెరికా దగ్గరే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రష్యా, చైనాలతో అణ్వాయుధాల తగ్గింపు ప్రయత్నాలపై అమెరికా చర్చించిందని ఆయన చెప్పారు. ఇటీవల, రష్యా అధునాతన అణు సామర్థ్యం గల వ్యవస్థలను పరీక్షించినట్లు పేర్కొన్నారు. 30 సంవత్సరాలకు పైగా విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తక్షణమే పునఃప్రారంభించాలని ట్రంప్ ప్రకటించారు. ఇది సముచితమని ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అణ్వాయుధాలకు ఉపయోగపడే పదార్థాల ఉత్పత్తిని పరిమితం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే అప్పటికే నిలిచిపోయిన ప్లూటోనియం పారవేసే ఒప్పందాన్ని అమెరికాతో రద్దు చేస్తూ ఒక చట్టంపై సంతకం చేశారు.