
రైతు సంక్షేమమే ధ్యేయం – చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్
ప్రైవేట్ వారికి అమ్మి మోసపోకండి: వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్
రైతులకు న్యాయం చేయాలి: పిఎసిఎస్ చైర్మన్ బక్కన్న యాదవ్
( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాణ్యత కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడుతామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండల పిఎసిఎస్ ద్వారా వరి, మొక్కజొన్న మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నిశాంత్ కుమార్ తదితర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ప్రతి గింజను కొనుగోలు చేసేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అధికారులు నిరంతరం రైతులకు వెన్నంటే ఉండి వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా రైతుల పట్లగా సానుకూల దృక్పథంతో ఉందని, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇబ్బందుల నివారణకు కృషి చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మాట్లాడుతూ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని రైతులకు నష్టం వాటిల్లకుండా పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం నియోజకవర్గంలో 37, మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సాగు చేయబడుతుందని, అదేవిధంగా 14 వేల మెట్రిక్ టన్నుల మక్కను పండిస్తున్నారని వెల్లడించారు. రైతులు కొంచెం ఆరబెట్టి నాణ్యతతో తీసుకువస్తే మంచి ధరలు వస్తాయని, ప్రైవేట్ వారికి అమ్మి మోసపోవద్దని కోరారు. పిఎసిఎస్ చైర్మన్ బక్కన్న యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల కారణంగా చాలా మటుకు ధాన్యం పచ్చిగా మారడం, నలుపు రంగులోకి రావడం జరిగిందని అలాంటి రైతులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్, భరత్ లహుటి, తిరుపతి రెడ్డి, క్యూ సెట్ శ్రీనివాస్, పాండురంగారెడ్డి రైతాంగం తదితరులు పాల్గొన్నారు..