PS Telugu News
Epaper

అమెరికాలో భారతీయ ప్రతిభ: ట్రంప్ కేసులో నీల్ కత్యాల్ సవాల్

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :రెండోసారి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వలసలతో పాటు వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన సుంకాలను అమెరికాలోని పలు కోర్టులు నిలిపివేశాయి. చివరకు ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ కేసు విచారణ బుధవారం జరగనుండగా.. ట్రంప్‌కి వ్యతిరేకంగా భారత సంతతి అటార్నీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఆయన గురించి అంతర్జాతీయ చర్చ జరుగుతోంది.అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైన న్యాయవిచారణకు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2 లిబరేషన్ డే పేరుతో సుంకాల మోత మోగించిన డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. టారీప్‌ల విషయంలో ట్రంప్‌ అధికారాలను తేల్చే అంశంపై అమెరికా కాలమానం ప్రకారం నవంబరు 5న (బుధవారం) అక్కడ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో భారత సంతతి న్యాయవాది నీల్‌ కత్యాల్‌.. ట్రంప్‌నకు వ్యతిరేకంగా వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది.భారత సంతతికి చెందిన 54 ఏళ్ల నీల్ కత్వాల్ చికాగోలో జన్మించారు. తల్లిదండ్రులు భారత్‌ నుంచి వలసవెళ్లారు. తల్లి వైద్యురాలు, తండ్రి ఇంజినీర్. యేల్‌ యూనివర్సిటీ లా స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నీల్‌.. బరాక్ ఒబామా హయాంలో అమెరికా సొలిసిటర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. అమెరికా సుప్రీంకోర్టులో ఇప్పటి వరకూ ఆయన 50కి పైగా కేసులను వాదించారు. తొలిసారి 2000 సంవత్సరంలో బుష్ వి జార్జ్ కేసుతో వెలుగులోకి వచ్చారు. నీల్ సోదరి సోనియా కత్యాల్ కాలిఫోర్నియా యూనివర్సిటీ‌లో ప్రొఫెసర్.గతంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో నీల్ వాదించిన సందర్భాలు ఉన్నాయి. తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017లో కొన్ని దేశాలపై ట్రంప్ విధించిన ట్రావెల్ ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన కేసులను నీల్‌ వాదించారు. ‘ఇంపీచ్‌: ది కేస్‌ ఎగెనెస్ట్ డొనాల్డ్‌ ట్రంప్‌’ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. తాజాగా, సుంకాలను వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసిన చిరు వ్యాపారులు, డెమొక్రాట్‌‌లు అధికారంలో ఉన్న రాష్ట్రాల కూటమి, జస్టిస్ లిబరేషన్ సెంటర్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు నీల్ సిద్ధమవుతున్నారు.ఈ సెంటర్ దాఖలు చేసిన పిటిషన్‌ ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో 7–4 మెజార్టీతో విజయం సాధించింది. అధ్యక్షుడు తన అధికార పరిధిని మించిపోయారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ తీర్పునే సుప్రీం కోర్టులో ట్రంప్ యంత్రాంగం సవాల్ చేసింది. అక్టోబరు 20న కత్యాల్ దాఖలు చేసిన పిటిషన్‌లో ‘అధ్యక్షుడు వినియోగించిన అధికార హక్కు ఆశ్చర్యపరిచేంత విస్తృతంగా ఉంది’ అని ఆరోపించారు. ‘IEEPAలో ఎక్కడా సుంకాల (టారిఫ్‌ల) గురించి ప్రస్తావన లేదు.. 50 ఏళ్లలో ఏ అధ్యక్షుడూ ఈ అధికారాన్ని ఉపయోగించలేదు’ అని పేర్కొన్నారు.రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలతో ట్రంప్ విరుచుకుపడ్డారు. ట్రంప్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్ 1977 (IEEPA)ను ఉపయోగించి ఈ సుంకాలు విధించారని అమెరికా ప్రభుత్వం తెలిపింది. కానీ, ఈ చట్టాన్ని ఆయుధంగా చేసుకున్న అధ్యక్షుడు ఫెడరల్‌ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయాన్ని కొన్ని ఫెడరల్ కోర్టులు నిలిపివేశాయి. దీంతో ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టులో వీటిని సవాల్ చేయగా.. బుధవారం విచారణ జరగనుంది.ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ట్రంప్ తొలుత భావించినా కానీ, కొన్ని కారణాల వల్ల విరమించుకున్నారు. అమెరికా సర్కారు తరఫున వాణిజ్య శాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్‌ హాజరుకానున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో ఈ కేసు విచారణపై ట్రంప్ స్పందిస్తూ.. ‘‘తీర్పు మాకు అనుకూలంగా వస్తే.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న, సురక్షిత దేశంగా అమెరికా నిలుస్తుంది.. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే పేద దేశంగా మారుతుంది. అలా జరగకూడదని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top