PS Telugu News
Epaper

గల్ఫ్‌లో కుటుంబ దుఃఖం: తండ్రి మృతి, తల్లి ఆత్మహత్య, చిన్నారులు రోడ్డు మీద

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గ్రామాన్నే కాక, విన్న ప్రతి మనసును కదిలిస్తోంది. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్ళిన భర్త.. అక్కడ గుండెపోటుతో చనిపోవడం.. ఆ దుఃఖాన్ని తట్టుకోలేని భార్య.. కూడా ప్రాణం తీసుకోవడం.. చివరికి చిన్నారులు ఒంటరి కావడం.. ఈ వరుస ఘటనలు.. కన్నీరు తెప్పిస్తున్నాయి..వివరాల ప్రకారం.. కంచర్ల గ్రామానికి చెందిన దేవొల్ల హన్మంతు కుటుంబాన్ని పోషించడానికి సంవత్సరాల క్రితమే గల్ఫ్ లోని బహ్రెయిన్ దేశానికి వెళ్లాడు. భార్య దేవొల్ల పద్మ, చిన్నారులు ఇందు (11), లాస్య (7)తో కలిసి ఇక్కడే ఉంటోంది. అయితే సెప్టెంబర్ 26న అకస్మాత్తుగా హన్మంతుకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వార్త వినగానే పద్మ తట్టుకోలేకపోయింది.. ఆ బాధను తట్టుకోలేక పద్మ రోజు విలపించింది. తినడం, మాట్లాడడం కూడా మానేసింది. పద్మకు భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విలపించేది.. ఎవరికీ తన బాధ చెప్పేది కాదు.. భర్త లేకుండా ఎలా ఉండాలి.. పిల్లలను ఎలా పోషించాలన్న మనోవేదనతో చివరకు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. మనసులో దాచుకున్న వేదన చివరికి ఆమెను మింగేసింది..30 రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో.. ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. తల్లి శవం పక్కన కూర్చుని “అమ్మా లేవమ్మా…” అని చిన్నారులు విలపించగా ఆ దృశ్యం చూసినవారంతా కన్నీరు..మున్నీరుగా విలపించారు. గ్రామమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఎవరు చూసినా ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ఎలా అంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.. బంధువులు, పొరుగువారు, గ్రామ పెద్దలు కలిసి వారికి సంరక్షణ కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లలకు సమాజం అండగా నిలవాలి.. ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలంటూ గ్రామస్థులు కోరుతున్నారు. చిన్న వయస్సులోనే.. తల్లిదండ్రులను కోల్పోవడంతో చిన్నారుల భవిష్యత్తు ఎలా అంటూ పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top