
పయనించే సూర్యుడు, నవంబర్ 04( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పురాతన శివాలయం చుట్టూ నెలకొన్న తాళం వివాదం పెద్దదిగా మారింది. మండలానికి చెందిన ఆసాని చంద్రారెడ్డి వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న ఈ శివాలయం ఎన్నో దశాబ్దాలుగా గ్రామ ప్రజల భక్తికి నిలయంగా ఉంది. అయితే ఇటీవల చంద్రారెడ్డి మరియు అతని సోదరులు ఆలయం ప్రధాన ద్వారానికి తాళం వేసినట్టు స్థానికులు బీజేపీ నాయకులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన బీజేపీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు నాయకత్వంలో భారీగా కార్యకర్తలు, గ్రామస్తులు శివాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. వారితో పాటు పూజారిని తీసుకువచ్చి ఆలయానికి వేసిన తాళాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ప్రజల ఆస్తి అని, దానిపై వ్యక్తిగత హక్కు చూపడం చట్టపరంగానూ, ఆచార పరంగానూ సరైంది కాదని వారు తీవ్రంగా అభిప్రాయపడ్డారు. శివాలయం ప్రజలకు ధార్మిక శక్తి, ఆధ్యాత్మిక కేంద్రం అని పేర్కొన్న బీజేపీ నాయకులు, వ్యక్తిగతంగా తాళం వేయడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. ఇకపై ఎవరు శివాలయం పై ఏ రకమైన అడ్డంకులు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ఆలయం ఎల్లప్పుడూ అందరికీ తెరవబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వెన్నమనేని శ్రీధర్ రావు, కోలా ఆంజనేయులు, ఇటికల రాజు, సిలివేరి ప్రశాంత్, గజభింకర్ సంతోష్, ఆసాని లింగారెడ్డి, BJYM జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, జిల్లా మీడియా ప్రతినిధి కాసిగంటి రాజు, చిందం నరేశ్, కొడం రమేష్, హనుమత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కందుకూరి రామ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులకు శివాలయంపై ప్రేమ, భక్తి ఉన్న నేపథ్యంలో ఈ వివాదం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జోక్యంతో పరిస్థితి చల్లబడినప్పటికీ, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
