PS Telugu News
Epaper

మోదీ హెచ్చరిక – సంస్కృతి, విశ్వాసం పరిరక్షణకు ప్రజల పిలుపు

📅 06 Nov 2025 ⏱️ 3:49 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :బీహార్‌ ఎన్నికల సందర్భంగా అరారియాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. మహా కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి దేశ భద్రత గురించి మాత్రమే కాకుండా దాని విశ్వాసం గురించి కూడా ఎటువంటి ఆందోళన లేదని ఆయన అన్నారు. మన సంస్కృతి, విశ్వాసాన్ని అగౌరవపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, కాంగ్రెస్ నాయకులు బీహార్‌కు వచ్చి ఛఠీ మైయా పూజను డ్రామా అని పిలుస్తారని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఛఠీ మైయాను అవమానించడం కాదా? ఇది మన విశ్వాసాన్ని అవమానించడమే అన్నారు. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు, ఆర్జేడీ ఎందుకు మౌనంగా ఉంటుంది. కుంభమేళా సమయంలో స్నానం చేయడాన్ని ఇదే కాంగ్రెస్ నాయకులు ఎగతాళి చేసేవారని ప్రధాని మోదీ అన్నారు. రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారు. వారికి రాముడిపై నమ్మకం లేదు. వారికి విశ్వాసం లేదు. రామ్‌లాల ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు రాముడిని ద్వేషిస్తారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. “రాముడి ఆలయం ఎక్కడ నిర్మించామో, అక్కడ నిషాద్ రాజ్ కు కూడా ఒక ఆలయం ఉంది. వాల్మీకికి కూడా ఒక ఆలయం ఉంది. మాతా శబరికి కూడా ఒక ఆలయం ఉంది. రాముడిపై కోపం ఉంటే, వారి వద్దకు వెళ్లకండి, కానీ కనీసం ఇతర ప్రదేశాలకు అయినా వెళ్లండి” అని ప్రధాని మోదీ హితబోధ చేశారు.బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, “ఈరోజు మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. బీహార్ అంతటా సోషల్ మీడియాలో అద్భుతమైన చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు ఏర్పడుతున్నాయి. బీహార్ యువతలో అపూర్వమైన ఉత్సాహం ఉంది. ఇంకా ఓటు వేయని వారు, ఇళ్లను వదిలి బయటకు రాని వారు వీలైనంత త్వరగా ఓటు వేయాలని వినయంగా అభ్యర్థిస్తున్నాను. బీహార్ అంతటా ఒకే గొంతు ప్రతిధ్వనిస్తుంది.. అదే ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి ” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 1990 నుండి 2005 వరకు 15 సంవత్సరాలు “జంగల్ రాజ్” బీహార్‌ను పాలించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. “జంగల్ రాజ్” బీహార్‌ను నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడపడం పేరుతో, బీహార్ ప్రజలను దోచుకున్నారు. ఆ 15 సంవత్సరాల జంగిల్ రాజ్ కాలంలో బీహార్‌లో ఎన్ని ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు? సున్నా.” అని అన్నారు. ” కొన్ని రోజుల క్రితం, కాంగ్రెస్ – ఆర్జేడీ వైరాన్ని బయటపెట్టాను. కాంగ్రెస్ తన ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆర్జేడీకి వ్యతిరేకంగా నిలబెట్టింది. వారు మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్జేడీ జంగిల్ రాజ్‌ను బయటపెడుతున్నారు. ఈ జంగిల్ రాజ్ కింద దళితులు, మహాదళితులు, చాలా వెనుకబడిన వర్గాలు ఎక్కువగా నష్టపోయాయని చెబుతున్నారు. ఎన్నికలు ఇప్పుడే జరిగాయి. ఫలితాలు వెలువడే నాటికి, వారు ఒకరినొకరు గొడవలతో విడిపోతారు.” అని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు.

Scroll to Top