అప్పు ఇవ్వలేదని హత్య..!తల్లి ఎదుటే దారుణం
పయనించే సూర్యుడు న్యూస్ :అప్పు ఇప్పించలేదని అడ్డంగా నరికేశారు.. బంధువులే బంధుత్వాన్ని మరిచి కిరాతకంగా పొడిచేశారు. కళ్ల ముందే కన్నబిడ్డ రక్తపు ముడుగులో కొట్టుకొని చనిపోవడం చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఇక కొడుకు తిరిగి రాడని తెలిసి శోక సంద్రంలో మునిగిపోయింది. అప్పు ఇప్పించకపోవడం ఒక్కటేనా ఇంకా ఏమైనా కారణాలున్నాయా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గుంటూరు జిల్లా దుగ్గిరాల రజక కాలనీలో నివాసం ఉండే వీరబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అయితే తెలిసిన వాళ్లకి అప్పులు ఇప్పిస్తుంటాడు. వీరబాబుకి తల్లి రమణ, భార్య, ఇద్దరూ పిల్లలున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరబాబు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో బంధువైన నవీన్ పది వేల రూపాయల అప్పు ఇప్పించాలని వీరబాబుని అడిగాడు. నవీన్ గుంటూరులో నివాసం ఉంటూ ప్రతి ఆదివారం దుగ్గిరాల వచ్చి చికెన్ విక్రయిస్తుంటాడు. తన షాపు నిర్వహణకు అవసరమైనప్పుడు వీరబాబు వద్ద అప్పు తీసుకుంటాడు. చికెన్ విక్రయం తర్వాత అప్పు చెల్లిస్తుంటాడు. అయితే నిన్న ఉదయం పదివేల రూపాయల కావాలంటూ నవీన్ అడగ్గా తన వద్ద లేవని వీరబాబు చెప్పాడు. ఎవరి వద్దా ఇప్పించలేనని తేల్చి చెప్పాడు. దీంతో నవీన్… వీరబాబుతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో నవీన్ చొక్కా పట్టుకున్న వీరబాబు.. మరోసారి డబ్బులు అడగవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీన్.. మద్యం సేవించడం మొదలు పెట్టాడు. తనకి బంధువైన క్రిష్ణకి ఫోన్ చేసి వీరబాబు ఇచ్చిన వార్నింగ్ గురించి చెప్పాడు. తన చొక్కా పట్టుకున్న విషయాన్ని వివరించాడు.అనంతరం.. నవీన్, క్రిష్ణ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలోనే.. సాయంత్రం సమయంలో వీరబాబు తన తల్లిని ఆర్ఎంపి వద్దకు తీసుకెళ్లాడు. దీనిని గమనించిన నవీన్, క్రిష్ణ ఆర్ ఎంపి వైద్యశాల వద్దకు వచ్చి వీరబాబుతో గొడవకు దిగారు. కొద్ది సేపటి తర్వాత కత్తులతో విచక్షణా రహితంగా వీరబాబుపై దాడి చేశారు. అనంతరం అక్కడ నుండి పారిపోయారు. కన్న తల్లి కళ్ల ముందే కొడుకు రక్తపు మడుగులో పడిపోయాడు. స్థానికుల సాయంతో తెనాలి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అప్పు ఇప్పించలేదన్న కారణంతోనే హత్య చేశారా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.