PS Telugu News
Epaper

మెడికల్ షాపుల్లో బినామీల దందా కానరాని ఫార్మసిస్ట్

📅 10 Nov 2025 ⏱️ 3:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే అమ్మకాలు

నామమాత్రంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు

ఆర్ఎంపీల అర్హతకు మించిన వైద్యం

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న శంకర్ దాదా ఎంబిబిఎస్ లు

పయనించే సూర్యుడు నవంబర్ 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం జిల్లా

మెడికల్ దందా ఇష్టారాజ్యంగా ఔషధాల విక్రయాలు అధిక ధరల కు మందులు, బిల్లులు లేకుండా అమ్మకాలు, నిద్రావస్థలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, మెడికల్‌ షాపుల యజమానుల సంఘాల గుప్పెట్లో అధికారులు
మెజార్టీ మెడికల్‌ షాపుల్లో దందా నడిపిస్తూ నాణ్యతలేని మందులను అంటగడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు అనే విషయం ప్రజలలో బాగా వినపడుతుంది, ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే అమ్మకాలు
అడ్డగోలుగా ఔషధ వ్యాపారం ఫిజీషియన్‌ శాంపిళ్లు, కాలం చెల్లిన మందుల విక్రయాలు నామమాత్రంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు షాపుల్లో బినామీల దందా.. కానరాని ఫార్మసిస్టు రోగుల ప్రాణాలతో చెలగాటం

మెడికల్‌ షాపుల మాయాజాలం

మెడికల్‌ షాపు చిన్నదైనా పెద్దదైనా అందులో ఫార్మాసిస్ట్‌ ఉండాలి. మందులు ఎలా వేసుకోవాలో రోగికి విడమర్చి చెప్పాలి. డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ ఉంటేనే మందులు ఇవ్వాలి. రోగి శారీరక, మానసిక పరిస్థితిని బట్టే అవసరమైన మందులు ఇవ్వాలి. ఇలా మెడికల్‌ షాపుల నిర్వాహకులు నిబంధనలను పాటించాలి. కానీ నిబంధనలను పాటించడం లేదు

అధికారులు నిర్లక్ష్యం

డాక్టర్‌ రాసిచ్చే చిట్టీతో సంబంధం లేకుండా ఎవరడిగినా మందులు ఇచ్చేస్తున్నారు. డి-ఫార్మసీ/ఎం-ఫార్మసీ సర్టిఫికెట్‌ ఉంటే చాలు.. మెడికల్‌ షాపు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే దుకాణదారులు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్ని రోజులు వాడాలో కూడా మెడికల్‌ షాపుల నిర్వాహకులే చెప్పేస్తారు.నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. నిబంధనల ప్రకారం వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ ఉంటేనే మెడికల్‌ షాపుల్లో మందులు ఇవ్వాలి. ఈ నిబంధనలను చాలా మంది దుకాణదారులు పాటించడం లేదు.

ఆర్ఎంపి అర్హతకు మించి వైద్యం

జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపునొప్పి గ్యాస్ర్టిక్‌ సమస్యలు, ఒంటినొప్పులు తదితర సమస్యలకు మెడికల్‌ షాపుల్లో అడగ్గానే మందులు ఇస్తున్నారు కార్డియాలజీ, సైక్రియాట్రిక్‌, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్‌ స్ర్టోక్‌, డయాబెటిక్‌, బీపీ, థైరాయిడ్‌, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ తదితర సమస్యలకు డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వకూడదు. ఈ వ్యాధుల ఔషధాల్లో హై డోస్‌.. లో డోస్‌ అనే రకాలు ఉంటాయి. వ్యాధి తీవ్రత, రోగి వయసు, శరీర తత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్‌ను నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్‌ షాపునకు వెళ్లి అడిగితే ఏ రోగానికైనా, ఎన్ని మందులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొందరు దగ్గుకు వాడే సిర్‌పలు తాగుతున్నారు. కోరెక్స్‌, పెన్సిడ్రిల్‌ వంటి ఔషధాలు కొంత మత్తును కలిగిస్తాయి. ఆల్కహాల్‌, ఇతర మత్తు పదార్థాలకు బానిసైనవారు అవి దొరకని సమయాల్లో మెడికల్‌ సిర్‌పలు వాడుతున్నారు. ఈ తరహా సిర్‌పలు డాక్టర్‌ రాసిస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ కొన్ని మెడికల్‌ షాపుల్లో ఎవరెన్ని, ఏమి అడిగినా ఇచ్చేస్తున్నారు. ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా అర్హతకు మించి వైద్యం చేస్తున్నారు

ఎక్స్‌పైర్డ్‌ మందులూ అమ్ముతున్నారు

డ్రగ్స్‌, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నాయి.
డాక్టర్‌ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులను అంటగడుతున్నారు. ఏమన్నా అంటే.. ‘సేమ్‌ ఫార్ములా.. కంపెనీ మాత్రమే వేరు. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది.’ అని చెబుతున్నారు రోజూ ప్రతి చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.3వేల నుంచి రూ.లక్ష వ్యాపారం జరుగుతుంది.

లైసెన్స్‌ ఒకరిది.. నిర్వహణ మరొకరిది

మందుల షాపులు బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్‌ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితో మాత్రమే దుకాణాలను నిర్వహించాలి. చాలా మంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్‌పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు, ఏడీలు మెడికల్‌ షాపుల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకొని నిబంధనలకు పాతరేస్తున్నారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లతో ఒప్పందాలు చేసుకొని మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు.

మామూళ్ల మత్తులో…

డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌ ప్రకారం ప్రతీ మెడికల్‌ షాపులో రిజిష్టర్డ్‌ ఫార్మసిస్టు ఉండాలి. బి-ఫార్మసీ, ఎం-ఫార్మసీ ఇలా ఏదో ఒక ఫార్మసీ కోర్సు చేసిన వారు మాత్రమే మెడికల్‌ షాపు నిర్వహించాలి. మెడికల్‌ షాపులకు అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మాసిస్టు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలి. ఏరియా ఇన్‌స్పెక్టర్లు ఈ బాధ్యత నిర్వర్తించాలి. కానీ కొందరు ఏరియా ఇన్‌స్పెక్టర్లు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

పర్సంటేజీలు మాట్లాడుకొని…

జనరిక్‌, నాన్‌ జనరిక్‌ అనే తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని మెడికల్‌ షాపులు, కెమిస్ట్‌ డ్రగిస్ట్‌ ఏజెన్సీలపై దృష్టిసారించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది

బినామీలు

డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్టు- 1940, ఫార్మసీ యాక్టు- 1948 ప్రకారంగా బీ ఫార్మసీ లేదా ఎం. ఫార్మసీ పూర్తిచేసిన వారే మెడికల్ షాపులు నిర్వహించాలి. షాపు పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత ఫార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తి గత గుర్తింపుకార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో జతచేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమర్పించాలి. అనుమతి మంజూరైన తర్వాతే షాపులు నిర్వహించాలి. జిల్లాలో మెడికల్ షాపులు చాలామంది బినామీలే నిర్వహిస్తున్నారు.

పేమెంట్ ఫుల్ బిల్లు రసీదు నిల్

కొనుగోలు చేసిన వారికి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి. ఆ బిల్లుపై బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, ఎక్స్ పైరీ డేట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలా మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన మందులకు బిల్లులు ఇవ్వడం లేదు.
సరైన తనిఖీలు లేకపోవడంతో అనేక మెడికల్ షాపుల్లో ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా మందులు అమ్ముతున్నారు. ప్రతి మెడికల్ షాపులో తప్పనిసరిగా ఓ ఫార్మసిస్ట్ ఉండాలి. కానీ ఏ ఒక్క షాపులో కూడా ఫార్మా సిస్టులు ఉండడంలేదు.క్వాలిఫైడ్ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ మందులు అమ్మాలి. హెచ్1 రిజిస్టర్ లో తప్పనిసరిగా నమోదు చేయాలి. బిల్లును తప్పనిసరిగా కొనుగోలుదారుడికి ఇవ్వాలి. అయితే జిల్లాలోని అనేక మెడికల్ షాపుల్లో ఈ నిబంధనలను యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు.
మత్తుమందుల అమ్మకాలపై సంబంధిత ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోకపోవడం మెడికల్ వ్యాపారులకు వరంగా మారింది

Scroll to Top