పవన్ కళ్యాణ్ కొత్త ఆపరేషన్ – అడవి కబ్జాలపై దాడికి రెడీ!
పయనించే సూర్యుడు న్యూస్ :చిత్తూరు జిల్లా శేషాచలంలో అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంపై అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శేషాచలంలో కబ్జాపై జనసేన వీడియో విడుదల చేసింది. అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ కల్యాణ్ స్వయంగా వీడియో తీశారు. అడవి మధ్యలో వారసత్వంగా భూమి ఎలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన భూభాగం విస్తీర్ణం, కేసుల వివరాలను అటవీ శాఖ అధికారిక వెబ్ సైట్‌లో ఉంచాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్ ల్యాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం 76.74 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారంంటూ పవన్ పోస్టు చేశారు. అటవీ ప్రాంతాలకు ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ భూముల ఆక్రమణల్లో వైసీసీ సీనియర్ నేత, మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందన్నారు. అలాగే రక్షిత అటవీ భూముల్లో అక్రమంగా కట్టడాలు నిర్మించారు. ఇందులో భాగంగానే సైట్‌ను స్వయంగా పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ నివేదికను సీఎం చంద్రబాబుకి సమర్పించారు.అంతకుముందు, పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించారు. ఆయన నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ పైకి ఎక్కి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. ముఖ్యంగా ఎర్రచందనం చెట్లను, అలాగే శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అనంతరం, ఎర్రచందనం నిల్వ గోడౌన్లను పరిశీలించి, అక్రమ రవాణాపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఆపరేషన్ కగార్ తరహాలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.