PS Telugu News
Epaper

డీజీపీ వ్యాఖ్యలు: ఉగ్రదాడి కాదు, పోలీస్‌స్టేషన్‌లో జరిగినది ప్రమాదం మాత్రమే

📅 15 Nov 2025 ⏱️ 12:20 PM 📝 క్రైమ్-న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్‌తో సహా 9 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ కీలక విషయాలు వెల్లడించారు. నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఉగ్రదాడి అనే వాదనలను డీజీపీ ఖండించారు. అది ప్రమాదవశాత్తు జరిగిందని.. ఉగ్రదాడి కాదని తెలిపారు.‘‘ఢిల్లీ పేలుళ్లు, వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్ నుండి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ పదార్థాలు అత్యంత సున్నితమైనవి. వీటిని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచి, గత రెండు రోజులుగా శాంపుల్ కలెక్షన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11:20 గంటలకు ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది’’ అని డీజీపీ తెలిపారు. పోలీసులు ఈ వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నమూనాలను తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని డీజీపీ స్పష్టం చేశారు.ఈ పేలుడు పదార్థాలను వాస్తవానికి హర్యానాలోని ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన డాక్టర్ ముజమ్మిల్ గనాయ్ అద్దెకు తీసుకున్న ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇవి నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో ఉపయోగించిన ఐఈడీకి సంబంధించినది కావడం గమనార్హం.పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయి.పేలుడుకు సంబంధించి హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ లోఖండే కూడా క్లారిటీ ఇచ్చారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడే అని ధృవీకరించారు. నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపుతున్నప్పుడే ఈ సంఘటన జరిగిందని ఆయన తెలిపారు. కాగా ఇది దురదృష్టకర పొరపాటు లేదా ప్రమాదం వల్ల జరిగిన సంఘటన అని, బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కాగా గాయపడిన 27 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Scroll to Top