ఐదేళ్ల విరామం తరువాత ఇండిగో సేవలు పునఃప్రారంభం
పయనించే సూర్యుడు న్యూస్ :గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు ఇండిగో సేవలు పునఃప్రారంభం అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణలో మరో ముఖ్యమైన పురోగతి సాధించినట్టు అయ్యింది. ఐదేళ్ల విరామం తర్వాత గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఇండిగో విమాన సేవలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇకపై viability gap funding లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు.. అంటే మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్ సర్వీసులు నడపనుంది. ఈరోజు ఉదయం 7:30 గంటలకు గన్నవరం నుంచి మొదటి రీ-లాంచ్ ఫ్లైట్ సింగపూర్‌కు బయల్దేరింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఇండిగో సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో వ్యాపార రంగం, విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, టూరిజానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుందని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ సర్వీసుల పునఃప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ విమాన కనెక్టివిటీలో మరో కీలక అడుగు ముందుకు వేసినట్టు అయ్యింది.