సమస్యల సుడిగుండంలో దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ఇరుకు గదుల్లో వైద్య సేవలు డాక్టర్ గదిలోనే కాన్పులు
పయనించే సూర్యుడు నవంబర్ 22 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యల సుడిగుండంలో కొట్టిమిట్టాడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రధానమైన లక్ష్యంతో 2018లో దెందుకూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సొంత భవనం లేదు. ఒకవేళ అద్దెకు తీసుకుందామానుకున్నా గ్రామీణ ప్రాంతం కావడంతో అన్ని వస్తువుల కూడిన భవనం లభించడం లేదు. దీంతో వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చేసేదేమీ లేక గతంలో దెందుకూరు గ్రామంలో రెండు గదులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో పీహెచ్సీ ని ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఉప కేంద్రంలో ఉన్న రెండు ఇరుకు ఉన్నాయి. వాటిలో ఒక గదిలో డాక్టరు వైద్య సేవలు అందిస్తుండగా మరో గదిని రోగులకు ప్రథమ చికిత్స చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కాన్పులు కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలు ఆసుపత్రిలో సరైన వసతి లేక అనేక అవస్థలు పడుతూ వైద్య సేవలు పొందుతున్నారు. నార్మల్ డెలివరీ చేయాలంటే డాక్టర్లు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో డాక్టర్ గదిలోని అప్పటికప్పుడు బెడ్ ఏర్పాటు చేసి కాన్పులు చేస్తున్నారు. దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజు 80 నుండి 100 వరకు రోగులు వస్తున్నారు. వారిలో ఎవరికైనా సీరియస్ గా ఉండి ఇన్ పేషెంట్లుగా ఉంచుకొని వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో ఎటువంటి వసతులు లేవు. దీంతో వైద్యులు సీరియస్ కేసులను పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మధిర ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నారు. గత మూడేళ్లలో దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 121 సాధారణ కాన్పులు చేశారు. దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు పల్లె దవాఖానాలు ఒక బస్తీ దవాఖాన రెండు సబ్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో ఖమ్మంపాడు సబ్ సెంటర్ శిధిలావస్థకు చేరుకుంది. పేద ప్రజలు అత్యధికంగా వైద్య సేవలు పొందే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కల్పించాలని, దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సొంత బిల్డింగు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.