తల్లిలాంటి ప్రేమను అంగన్వాడీ కేంద్రాలు అందించాలి: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పయనించే సూర్యుడు నవంబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు తల్లిలాంటి ప్రేమను అందజేయాలని సిడిపిఓ, సూపర్వైజర్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అపార్ ఐడి, అభా ఐడి, ప్రీస్కూల్ అటెండెన్స్ తదితర అంశాలపై సిడిపిఓలు, సూపర్వైజర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐసిడిఎస్ పిడి లీలావతి, జిల్లా కోఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమావేశాల్లో ఎక్కువ శాతం విద్యా, ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ఎక్కువ శాతం బడ్జెట్ కేటాయించడం జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని బట్టి ప్రభుత్వాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందో తెలుసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు ఎన్నో వేల కోట్ల రూపాయలతో పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు అందజేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అందించే ఆహారం వల్ల దేశ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలని, అంతేకుండా పరిసరాలతో పాటు టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు తాజా కాయగూరలతో పాటు వారి వయస్సును బట్టి విలువలతో కూడిన విద్యను చిన్నారులకు అందించాలని, వాటి ద్వారా పిల్లలు ఉత్సాహవంతులుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. టీనేజ్ గర్భాలకు సంబంధించి బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డలో ఎక్కువ శాతం కేసులు నమోదు అవుతున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిడిపిఓలను కలెక్టర్ ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా 6 నెలల నుండి 3 సం.లు, 3 సం.ల నుండి 6 సం.ల వయస్సు ఉన్న పిల్లలు ఎంత మంది ఉన్నారు అనే వివరాలను సోమవారం సాయంత్రం నాటికి అందజేయాలని సిడిపిఓ, సూపర్వైజర్లను కలెక్టర్ ఆదేశించారు. సదరు డేటాను అనుసరించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అదే విధంగా రానున్న రోజుల్లో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించడం జరుగుతోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలు పునరావృతం జరిగిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందోని సిడిపిఓలు, సూపర్వైజర్లను కలెక్టర్ హెచ్చరించారు.అనంతరం సఖి వన్ స్టాప్ సెంటర్, మిషన్ వాత్సల్య, పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలు తదితర అంశాలపై కులకుశంగా చర్చించారు. అదే విధంగా దత్తత ప్రక్రియకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.