చిన్నారులే పోలీసుల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఘటన
పయనించే సూర్యుడు న్యూస్ :ఒంగోలు సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు నిందితులు పోలీసుల కళ్లుగప్పి సినీ ఫక్కీలో పరారయ్యారు. పలు బైక్‌లు చోరీ చేసిన కేసుల్లో ఒంగోలు నగరానికి చెందిన ఇద్దరు మైనర్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల దగ్గర నుంచి 5 మోటార్ బైకులు రికవరీ కూడా చేశారు. నగరంలో చోరీలకు పాల్పడుతున్న 16 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు నిందితులను రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఒంగోలు సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఉన్న ఆ ఇద్దరు నిందితులు సెంట్రీ కళ్లుగప్పి పరారయ్యారు. పరారైన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.పోలీసులు వేసిన తాళాలతోనే బేడీలు విప్పుకుని ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఈ ఇద్దరు నిందితుల్ని సర్వైలెన్స్ రూంలో ఉండగా పరారైనట్టు గుర్తించారు. ఒంగోలు తాలూకా పీఎస్ పరిధిలో పలు బైక్‌ల చోరీల కేసుల్లో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారు. సర్వైలెన్స్ రూమ్‌కి తాళాలు వేసి పక్కనే గోడకు తగిలించి పోలీసులు బయటకు వెళ్లారు. స్టేషన్‌లో ఎవరు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు నిందితులు రూమ్‌లో ఉన్న చీపురు పుల్లలను దారంతో కట్టి గోడకు ఉన్న తాళాలను లాగి తాళాలు తీసుకొని పరారయ్యారు. అనంతరం తాళాలు అక్కడే పారేసి పారిపోయారు. వీరు పారిపోతున్న సమయంలో సెంట్రీగా ఉన్న కానిస్టేబుల్ ఆంజనేయులు సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిసింది. వీరిద్దరూ గతంలో గంజాయి సేవిస్తూ చోరీలకు పాల్పడుతున్న నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనతో బిత్తరపోయిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది.