ఆంధ్రప్రదేశ్లో కొత్త ‘రైతన్నా’ కార్యక్రమం ప్రారంభం: నేటి నుంచి రాష్ట్రవ్యాప్త అమలు
పయనించే సూర్యుడు న్యూస్ :నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ”రైతన్నా.. మీకోసం” కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం ఏడు రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ నెల 24 నుండి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ అధికారులు వెళ్లనున్నారు. రైతుల సమాచారాన్ని సేకరించడంతో పాటు, వారికి పలు సూచనలు చేయనున్నారు వ్యవసాయ అధికారులు. సాంప్రదాయంగా వస్తున్న పంటలను కాకుండా.. నూతన పంటల వైపు అడుగులు వేసేలా అన్నదాతలను సిద్ధం చేయనున్నారు. మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, దానికి అనుగుణంగా పంట మార్పిడి చేసుకునే విధానంపై అవగాహన కల్పించనున్నారు.పంటల సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గుదల వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించునున్నారు వ్యవసాయ అధికారులు. రైతు సేవ కేంద్రంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్ తో పాటు ఆరుగురు సచివాలయ సిబ్బందిని ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమాచార సేకరణ చేయనున్నారు. పంచ సూత్రాల అమలుపై రైతులకి అవగాహన కల్పించునున్నారు. డిసెంబర్ 3న ప్రతి రైతు సేవ కేంద్రంలో వర్క్ షాప్ నిర్వహించి ఖరీఫ్, రబీ పంటలపై రైతులకు సూచనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ అధికారులను కూడా భాగస్వామ్యం చేసింది ప్రభుత్వం. ప్రకృతి వ్యవసాయంవైపు రైతులను మళ్లించేలా అధికారులు సూచనలు చేయనున్నారు.