ఆస్తి కోసం కుటుంబ సభ్యులను ఏం చేశారో తెలుసా?
పయనించే సూర్యుడు న్యూస్ :నేడు మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తి తగాదాల ముందు పేగు బంధాలు చిన్నబోతున్నాయి. రక్తసంబంధాన్ని మరిచి ఆస్తికోసం తోబుట్టువులనే అంతమొందిస్తున్నారు. పేగు బంధంతో జన్మించిన తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. భూ వివాదంలో ఓవైపు తల్లి, కుమారుడు.. మరో వైపు కుమార్తె, ఆమె పిల్లలు.. ఈ గొడడలో సోదరుడు.. సోదరి, ఆమె కుమార్తెలపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.నేడు మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.. భూవివాదంతో సొంత కుటుంబ సభ్యులే.. ఒకరినొకరు చంపుకునేందుకు ప్రయత్నించారు.. సంచలనంగా మారిన ఈ ఘటన తెలంగాణలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో జరిగింది.. బరాఖత్ గూడెంలో కళావతి, రాంరెడ్డి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. వీరిని ఉన్నంతలో చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. కొడుకు ఉపేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కళావతి.. కుమార్తె జ్యోతికి కొంత అప్పుగా ఇచ్చింది. ఒకవైపు ఉపేందర్ రెడ్డికి తన సోదరి జ్యోతితో కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. మరోవైపు కళావతికి జ్యోతి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే కూతురు జ్యోతి తన పొలంలో వరి కోత మిషన్ తో పని చేస్తున్నారు. డబ్బులు విషయంలో ఆగ్రహంగా ఉన్న తల్లి కళావతి, సోదరుడు ఉపేందర్ రెడ్డి.. ట్రాక్టర్ పై వచ్చి వరి కోత మిషన్ కు అడ్డుగా పెట్టారు. వరి కోత మిషన్ డ్రైవర్ ను ఉపేందర్ రెడ్డి బెదిరించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఉపేందర్ రెడ్డి.. అక్కడితో ఆగకుండా సోదరి జ్యోతితో పాటు, ఇద్దరు మేనకోడళ్లపై ట్రాక్టర్ తో ఢీ కొట్టాడు. దీంతో వారు గాయాలతో బయటపడ్డారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో ప్రాణాలను కబళించేలా దాడులు చేశారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులు, రైతులు వచ్చి అడ్డుకున్నారు.