టమాటా ధరల్లో భారీ పెరుగుదల: 15 రోజుల్లో 50% ఎగబాకింది
పయనించే సూర్యుడు న్యూస్ :టమోటా ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మదనపల్లి మార్కెట్‌లో ఆకాశాన్నంటుతున్నాయి. భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణం. దిగుబడి లేకపోవడంతో రైతులు నష్టపోతుండగా, మార్కెట్‌లో డిమాండ్, సరఫరా మధ్య అంతరం టమోటా ధరలను 15 రోజుల్లోనే 50శాతానికి పెంచేశాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. టమోటా ధరలకు రెక్కలు వచ్చాయి. ఉన్న పళంగా బంగారం లాగానే ధరలు పెరుగుతున్నాయి. మదనపల్లి మార్కెట్ లో కిలో రూ. 63 టమోటా ధర తలుకుతుండగా గత పది రోజులుగా క్రమేణ పెరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా లోని పడమటి మండలాల్లో ప్రధాన ఆదాయ పంటగా టమోటా సాగు చేస్తున్న రైతులు ధర ఉన్న దిగుబడి లేక దిగాలు చెందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి,తంబళ్లపల్లి పుంగనూరు పలమనేరు నియోజకవర్గాల్లోనే దాదాపు 10 వేల హెక్టార్లలో టమోటా సాగు చేసిన రైతులు దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావించారు. సీజన్ ముగుస్తున్న సమయంలో మొంథా తుఫాను, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. వర్షాల వల్ల చీడ పురుగులతో తెగుళ్ల బెడద రైతులకు ఇబ్బందిగా మారడంతో పాటు దిగుబడి కూడా తగ్గేందుకు కారణమైంది.వర్షాల కారణంగా తేమశాతం అధికం కావడం, టమోటా మచ్చలు ఏర్పడడంతో పాటు పొలాల్లోనే కుళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో దిగుబడిపై ప్రభావం పడటం వల్ల మదనపల్లి మార్కెట్ కు దిగుబడి తగ్గింది. గతేడాది ఇదే సమయంలో రోజు సగటున దాదాపు 700 మెట్రిక్ టన్నుల టమోటా మదనపల్లి మార్కెట్ కు రాగా ప్రస్తుతం 150 మెట్రిక్ టన్నులకు దిగుబడి పడిపోయింది. మదనపల్లి సరిహద్దున ఉండే కర్ణాటక ప్రాంతంలోని కోలారు, చింతామణి, ముల్బాగల్ ప్రాంతాల నుంచి కూడా ఆశించిన మేర మదనపల్లి మార్కెట్ కు టమోటా దిగుబడి కాకపోవడంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. డిమాండుకు తగ్గట్టుగా మదనపల్లి మార్కెట్ లో టమోటా అందుబాటులో లేకపోవడం, మరోవైపు టమోటా కొనుగోలుకు బయట నుంచి ట్రేడర్లు కూడా ఆసక్తి చూపుతున్నడంతో మదనపల్లి మార్కెట్లో టమోటా కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం రూ.10 పలికిన కిలో టమోటాధర ఇప్పుడు ఏకంగా రూ. 60 కు పైగానే ఉంటోంది. మోంథా తోపాటు వరుసతుఫానుల ప్రభావంటో కురుస్తున్న వర్షాలు కారణంగా టమోటా ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తగ్గిన దిగుబడి తో నిన్న మదనపల్లి మార్కెట్ కు వచ్చిన 140 మెట్రిక్ టన్నుల టమోటా రాగా మొదటి రకం కిలో టమోటా ధర రూ. 52 నుంచి రూ.63 వరకు పలుకగా రెండో రకం ధర రూ. 33 నుంచి 50 లు దాకా పలికింది. దీంతో ధరలు ఆశాజనకంగా ఉన్న దిగుబడి టమోటా సాగు చేసిన రైతులను పెరుగుతున్న ధరలు ఊరించని పరిస్థితి నెలకొంది.