లొంగుబాటుకు సిద్ధమంటూ మావోయిస్టుల సంచలన ప్రకటన
పయనించే సూర్యుడు న్యూస్ : ఇటీవల మావోయిస్టులకు వరస షాక్‌లు తగులుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కారణంగా ఇప్పటికే చాలామంది మావోయిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు. రాబోయే ఏడాది మార్చిలోకా మావోయిస్టులు లేకుండా చేయాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. అయితే తాజాగా మావోయిస్టులు మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. తాము ఆయుధాలు వదిలేసేందుకు కొద్దిగా సమయం కావాలని, జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. ఇక ఈ లేఖ మావోయిస్టుల ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు కూంబింగ్ ఆపరేషన్‌లను నిలిపివేయాలని వారు కోరారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయా రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. అందులో ‘ మా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా నిర్ణయించారు. దీన్ని సమర్థిస్తూ.. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ ఆయుధాలు విడిచి పెట్టాలని భావిస్తోంది. అయితే దానికి కొంత సమయం కావాలని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. అంటూ రాసుకోచ్చారు.