గోల్డ్‌మ్యాన్‌ను లక్ష్యంగా పెట్టుకుని డిమాండ్ చేసిన గ్యాంగ్
పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గఢ్‌కు చెందిన వ్యాపారి కన్హయ్యలాల్ ఖాటిక్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. సుమారు 3.5 కిలోల బంగారం ధరించి కనపడే కన్హయ్యలాల్ ఖాటిక్‌ను గోల్డ్‌మ్యాన్, చిత్తౌర్‌గఢ్ బప్పి లహరిగా పిలుస్తారు.తాము రోహిత్ గోదారా గ్యాంగ్‌కు చెందిన వారిమని చెప్పుకుంటూ తనకు కొందరు వ్యక్తులు బెదిరింపు కాల్ చేశారని బప్పి లహరి చెప్పారు. బప్పి లహరి పండ్ల వ్యాపారం చేస్తుంటారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘గోల్డ్‌మ్యాన్’కు రెండు రోజుల క్రితం మిస్డ్ కాల్ వచ్చింది. అదే నంబర్ నుంచి కాసేపటి తర్వాత మళ్లీ వాట్సాప్ కాల్ వచ్చింది. ఆయన స్పందించకపోవడంతో అదే నంబర్ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ ఆడియో రికార్డింగ్ పంపించారు. “అడిగిన డబ్బు ఇవ్వకపోతే బంగారం ధరించే స్థితిలో నీవు ఉండవు” అని కాలర్ హెచ్చరించాడని ‘గోల్డ్‌మ్యాన్’ తెలిపారు. ఈ విషయాన్ని బయటకు రానివ్వద్దని చెప్పారని అన్నారు. ఆ తర్వాత ‘గోల్డ్‌మ్యాన్’కు మరో కాల్ వచ్చింది. మళ్లీ అదే హెచ్చరిక చేశారు. దీంతో ‘గోల్డ్‌మ్యాన్’ సిటీ కోట్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.ఒకప్పుడు రిక్షాపై కూరగాయలు అమ్మిన కన్హయ్యలాల్ ఖాటిక్ ఆ తర్వాత పండ్ల వ్యాపారం ప్రారంభించారు. ఆపిల్ ట్రేడింగ్ మొదలుపెట్టిన తర్వాత లాభాలు వచ్చాయి. ఆయనకు బంగారం అంటే ఇష్టం. శరీరంపై మూడున్నర కిలోల బంగారం ధరించి కనపడతారు. దీంతో ఆయన ఫేమస్ అయ్యారు. బికానెర్ లూనాకరణకు చెందిన గోదారా కెనడాలో ఉన్నట్లు భావిస్తున్నారు. భారతదేశంలోని అనేక పోలీస్ స్టేషన్లలో అతడిపై 32 కేసులు ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదారా రాజస్థాన్ వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేసేవాడు. పంజాబీ రాపర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఇతడు ఒకడు.