“కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో విమాన సర్వీసులపై ఎంపీల చర్చ: కీలక నిర్ణయాలపై దృష్టి”
పయనించే సూర్యుడు న్యూస్ :కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో టీడీపీ ఎంపీలు ఇవాళ సోమవారం భేటీ అయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి నడుస్తున్న సర్వీసులను అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీకి అనుసంధానం చేయాలని టీడీపీ ఎంపీలు మంత్రి రామ్మోహన్‌కు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా విజయవాడ – హైదరాబాద్ విమాన సర్వీసులు, ప్రయాణీకుల అవస్థలపై కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎంపీలు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ విమాన సర్వీసుల ధరలు రూ.18 వేలపైనే ఉంటున్నాయని, అయినప్పటికీ సీట్లు దొరకడం కష్టం అవుతుందని రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీలు.ముఖ్యంగా ఏటీఆర్ చిన్న విమానాల వల్లే ఈ సమస్య ఏర్పడుతోందని వెల్లడించారు. అమరావతికి వచ్చే పెట్టుబడిదారులు కూడా ఏటీఆర్‌లను చూసి ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రికి విన్నవించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల లగేజ్ కూడా వారితో రావడం లేదన్నారు ఎంపీలు, రెండు మూడు రోజుల తర్వాత చేరుతుందన్న ఫిర్యాదులు కూడా రోజురోజుకు అధికమవుతున్నాయని ఎంపీలు పేర్కొన్నారు. అవకాశం ఉన్నంతలో త్వరగా ఏటీఆర్‌ల స్థానంలో పెద్ద విమానాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే విజయవాడ నుంచి అహ్మదాబాద్, వారణాసి, పూణే, కొచ్చి, గోవాలకు కూడా కనెక్టివిటీ ఇవ్వాలన్నారు ఎంపీలు. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి నడుస్తున్న సర్వీసులను అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీకి అనుసంధానం చేయాలని రామ్మోహన్ నాయుడును కోరారు. ఈ సమస్యలపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చే వారం రోజుల్లో ఈ విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో విమానయ సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీలకు హామినిచ్చారు. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయకుడికి కృతజ్ఞతలు ఎంపీలు తెలిపారు.