చాలా భయంకర ఘటనం: మూగబాలుడిపై కుక్కల దాడి, సీఎం వెంటనే స్పందించారు
పయనించే సూర్యుడు న్యూస్ :రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హయత్‌నగర్‌లోని శివగంగ కాలనీలో 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఈ దాడిలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆరు బయట ఆడుకుంటున్న బాలుడిపై దాదాపుగా 10 నుంచి 15 కుక్కలు దాడి చేయటంతో నడుము, పిక్కలపై, చెవి మొత్తం ఊడిపోయింది. శివగంగ కాలనీలో అద్దెకు ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ కుమారుడు ప్రేమ్ చంద్ పుట్టుకతో మూగవాడు. వీరు గత మూడేళ్లుగా అదే ప్రాంతంలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉదయం తండ్రి పని నిమిత్తం బయటకు వెళ్లగా.. తల్లి ఇంట్లో నీళ్లు పట్టుకుంటుంది. ఈ సమయంలో బయటకు ఆడుకునేందుకు వెళ్లిన ప్రేమ్ చంద్‌పై కుక్కులు ఒక్కసారిగా దాడికి దిగాయి. స్థానికులు చూసి వాటిని తరిమివేశారు.ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు నల్లకుంట ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ చికిత్స అందించి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మన్సూరాబాద్ కార్పొరేటర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నగరంలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికి జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఏదో ఒకచోట చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేస్తున్నా.. అధికారులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. అయితే హయత్ నగర్లో మూగబాలుడు ప్రేమ్ చంద్‌పై వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఉదయం పేపర్లలో ఘటన వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించి కుటుంబాన్ని కలవాలన్నారు. అలాగే వారి బాగోగులు పరిశీలించి, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ఆదేశించారు.