PS Telugu News
Epaper

చిరుతపై చిన్నారి పోరాటం—అద్భుతంగా ప్రాణాపాయం తప్పిన ఘటన!

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :మహారాష్ట్రలో ఓ 11 ఏళ్ల విద్యార్థి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా చిరుత పులి వెంబడించింది. భయంతో వణికిపోకుండా ఆ బాలుడు తన స్నేహితుడి సహాయంతో చిరుత పులి పై రాళ్లు విసురుతూ, గట్టిగా అరుస్తూ చిరుత దాడిని తిప్పికొట్టాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన జరిగింది. పద్విపాడు ప్రాంతంలో మయాంక్ కువారా.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మయాంక్‌పైకి చిరుత దూకింది.. అతని వీపుపై ఉన్న స్కూల్ బ్యాగ్ రక్షణ కవచంగా పనిచేసి, పెద్ద ప్రమాదం నుంచి అతన్ని కాపాడింది. మయాంక్, అతని స్నేహితుడు భయపడకుండా గట్టిగా అరుస్తూ, చేతికి దొరికిన రాళ్లను చిరుతపైకి విసిరారు. పిల్లల అరుపులు విని చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై పరిగెత్తుకు వచ్చారు. జనం రావడం చూసిన చిరుత భయపడి తిరిగి అడవిలోకి పారిపోయింది. మయాంక్ చేతికి చిరుత పంజా గాయమైంది. వెంటనే అతడిని రూరల్ ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు ఆ గాయానికి కుట్లు వేసి చికిత్స చేసారు. ప్రస్తుతం ఆ చిన్నారి గాయం నుంచి కోలుకుంటున్నాడు. మయాంక్ కువారా ఘటనను సీరియస్‌గా తీసుకున్న అటవీ అధికారులు.. చిరుత పులులు సంచరించే ప్రాంతాల్లోని పాఠశాలలను సాయంత్రం 4 గంటలకే మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. చిరుత కదలికలను ట్రాక్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కెమెరాను ఏర్పాటు చేస్తున్నారు. ఇక చిరుతల సంచారం ఉండే గ్రామాల్లో డప్పు కొట్టి చెబుతూ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.

Scroll to Top