ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు
పయనించే సూర్యుడు న్యూస్ :నిరసనలు, హెచ్చరికల మధ్యనే హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 7.2 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ సందర్భంగా రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో సాయంత్రం సంగీత విభావరి కార్యక్రమాన్ని 50 మంది కళాకారులతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.అయితే ఈ విగ్రహ ఏర్పాటు ముందే వివాదానికి దారి తీసింది. కొద్ది రోజుల క్రితం నటుడు శుభలేఖ సుధాకర్ కమిటీ సభ్యులతో కలిసి రవీంద్రభారతిలో ఏర్పాట్లను పరిశీలించిన సమయంలో తెలంగాణ వాదులతో వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ విగ్రహ ఏర్పాటు పనులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, శుభలేఖ సుధాకర్‌తో తీవ్ర వాగ్వాదం జరిగింది. తెలంగాణ గడ్డపై ముందుగా గద్దర్, అందెశ్రీ వంటి ఉద్యమకవులకు గౌరవం దక్కాలని, బయటి రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని అంగీకరించబోమని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పరిస్థితిని శాంతింపజేసేందుకు శుభలేఖ సుధాకర్ ప్రయత్నించినా వివాదం చల్లారలేదు. ఈ అంశంపై అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తే.. ఉద్యమ వర్గాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాపక్షాన పోరాడిన తెలంగాణ కవులు, కళాకారుల విగ్రహాలు ముందుగా ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే ఇతరుల విషయమని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ వాదులు మరో ప్రశ్నను లేవనెత్తుతున్నారు. తెలంగాణలో ఎన్నో చోట్ల ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలకు చోటెక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. పీవీ నరసింహారావు వంటి మహానేతల విగ్రహాలకు అక్కడ ఎందుకు గౌరవం దక్కలేదని నిలదీస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా భావించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చుట్టూ ఈ తరహా వివాదం చెలరేగడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఇక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రవీంద్రభారతి పరిసరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్దిరోజుల పాటు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, రవీంద్రభారతి లోపల, బయట ఉన్న సీసీ కెమెరాలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.