మోదీ మూడు దేశాల టూర్ ప్రారంభం.. ఇథియోపియా చరిత్రాత్మక పర్యటన
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు మంగళవారం నుంచి డిసెంబర్ 18 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆ దేశాలతో భారత్ చారిత్రక బంధాన్ని మరింత బలో పేతం చేసుకోనుంది. అంతేకాకుండా వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత వంటి పలు కీలక రంగాల్లో కొత్తగా ఒప్పందాలు చేసుకోనుంది. అయితే, ఇథియోపియా పర్యటన ప్రధాని నరేంద్రమోదీకి తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో ఆ దేశ ప్రధాని అభియ్ అహ్మద్ అలీతో భేటీ కానున్నారు. కాగా, అభియ్ అహ్మద్ అలీ ఆహ్వాన మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇది తొలి పర్యటన కావడంతో పాటు భారత్, ఇథియోపియా దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యేందుకు దోహదం కానుంది.ఈ పర్యటలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇథియోపియా ప్రధాని అభియ్ అహ్మద్ అలీ మధ్య సమగ్ర చర్చలు జరగనున్నాయి. ఇందులో ప్రధానంగా రాజకీయ సహకారంతో పాటు అభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడి, ఇరు దేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు ఉండనున్నాయి. అలాగే గ్లోబల్ సౌత్‌లో భాగస్వామ్యంతో పాటు ఇరు దేశాల నాయకుల మధ్య స్నేహం బలోపేతం, పరస్పర ప్రయోజనం కోసం సహకారం చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. అడిస్ అబాబా సిటీని స్వాగత హోర్డింగ్‌లు, పోస్టర్‌లు, భారత జెండాలతో అలంకరించారు. 2011 నుంచి ప్రధానమంత్రి తొలి పర్యటనకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇథియోపియా సిద్ధమైంది. కాగా, మూడు దేశాల పర్యటనను సోమవారం ప్రారంభించగా.. మంగళవారం ఇథియోపియాకు చేరుకున్నారు. ఇథియోపియా పర్యటన తర్వాత ఒమన్‌కు వెళ్లనున్నారు.ప్రధానమంత్రి అభియ్ అహ్మద్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ మునుపటి ఎడిషన్‌లలో ప్రముఖంగా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పర్యటన దక్షిణ-దక్షిణ సహకారాన్ని మరింతగా పెంచనుంది. ఆఫ్రికాతో తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.