PS Telugu News
Epaper

రాహుల్ గాంధీ ఫైర్: కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉపాధి హక్కు విస్మరిస్తోందా?

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :(మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని) కేంద్రప్రభుత్వం నిర్వర్యం చేసిందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మండిపడ్డారు. 20 ఏళ్లనాటి హక్కును ఒక్కరోజులో విచ్ఛిన్నం చేసి, ‘VB-G RAM G’ అనే కొత్త విధానం మోదీ సర్కార్ తీసుకొచ్చిందని విమర్శించారు. ఎలాంటి చర్చలు లేకుండా తెచ్చిన ఈ కొత్త చట్టం వల్ల గిరిజన, దళిత మహిళలకు ఉపాధి దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ కోట్లాది మంది ఉపాధి హామీ వ్యవస్థను కూల్చివేయడమేనని వ్యాఖ్యానించారు. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంను మోదీ సర్కార్ ‘VB-G RAM G’ పేరుతో రేషన్ స్కీమ్‌లా మార్చేసిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. గతంలో ఉపాధి హామీ పథకం అనేది పేదలు అడిగితే కల్పించాల్సిన పని హక్కు, కానీ ఈ కొత్త విధానం ద్వారా దానిని డిమాండ్ ఆధారిత హామీ నుంచి తొలగించారన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమే కాకుండా గ్రామాల దళిత, గిరిజన మహిళలకు ఉపాధిని దూరంచేయడమేనని ఆయన దుయ్యబడ్డారు.ఈ పథకం గ్రామీణ కార్మికులకు ఉపాధిని కల్పించే పథకం. దీని ద్వారా గ్రామాల్లో వలసలు తగ్గాయని, పని విధానాలు మెరుగుపడ్డాయని గుర్తుచేశారు. అంతేకాదు ఈ పథకం కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా కోట్లాదిమంది ఆకలిని తీర్చి, అప్పుల పాలవుకుండా చేసిన పథకమని ఆయన తెలిపారు. ఇందులో సగానికి పైగా పనిరోజులు మహిళలవేనని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నష్టపోయేది కూడా ఎక్కువగా మహిళలేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కీలకమైన చట్టాన్ని చర్చలేకుండా, స్టాండింగ్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించి, ఆమోదించుకున్నారని రాహుల్ మండిపడ్డారు.

Scroll to Top