PS Telugu News
Epaper

ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం: జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి

📅 22 Dec 2025 ⏱️ 5:50 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 22, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న

నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్ లో ప్రజావినతుల స్వీకరణ అనంతరం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంపై ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో నిర్దేశిత గ్రామాలు, పట్టణ వార్డులను సందర్శించి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా పరిస్థితులను పరిశీలించి వివరాలు సేకరిస్తారని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ సందర్భంగా 11 కేవీ, ఎల్‌టీ, వ్యవసాయ విద్యుత్ లైన్లను కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. వాలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి మార్పు చేయడం, క్రిందకు వేలాడుతున్న వైర్లను సరిచేయడం, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దిమ్మలను ఎత్తు పెంచడం, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లకు ప్రోత్సాహం ఇవ్వడం, స్మార్ట్ మీటర్లపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం ద్వారా (ఫోన్ నంబర్: 89777 16661) అలాగే ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే విద్యుత్ సమస్యల నివారణకు టోల్‌ ఫ్రీ నంబర్లు 1912, 1800 425 155 333 లేదా వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఇంధనాన్ని పొదుపుగా వినియోగించి భావితరాలకు వెలుగును అందిద్దామని, ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించి సమయాన్ని ఆదా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. అనంతరం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమ పోస్టర్ ను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు.

Scroll to Top