PS Telugu News
Epaper

“రూ.8.10 కోట్ల సైబర్ మోసం కేసు నేపథ్యంలో మాజీ ఐపీఎస్‌కు సంబంధించిన ఘటన”

📅 23 Dec 2025 ⏱️ 12:30 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ : సైబర్ మోసాలు సామాన్య ప్రజలనే కాదు, ఉన్నతాధికారులను సైతం వదలడంలేదు. అయితే తాజాగా సైబర్ మోసానికి ఓ ఉన్నతాధికారి బలయ్యాడు. పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పోలీసుల తెలిపిన ప్రకారం.. మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ నిన్న (సోమవారం) తన ఇంట్లో గార్డు రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ఆత్మహత్యకు ముందుకు ఆయన 12 పేజీల సూసైడ్ నోట్‌ను రాసి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరుణ్ శర్మ అమర్ సింగ్ చాహల్ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పంజాబ్‌లోని పాటియాలాలో అమర్ సింగ్ చాహల్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియడంతో పోలీసు బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని, చాహల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందన్నారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు సాయశక్తుల ప్రయత్నిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.సూసైడ్ నోట్: పోలీసులు వివరాల ప్రకారం.. మాజీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థలంలో ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఆ నోట్‌లో చాహల్ సైబర్ మోసానికి గురయ్యాడని రాసి ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో రూ.8.10 కోట్ల ఆన్‌లైన్ మోసం కేసు గురించి ప్రస్తావించినట్లు పోలీసు వర్గాల తెలిపాయి. ఆన్‌లైన్ మోసంతో ఆర్ధిక నష్టాలతో ఒత్తిడికి లోనైనట్లు ప్రస్తావించారు. చాహల్ ఐజి పదవి నుంచి రిటైడ్ అయినప్పటి నుంచి పాటియాలలోనే నివసిస్తున్నారు.



Scroll to Top