PS Telugu News
Epaper

ఖమ్మంలో జరిగే పిడిఎస్ యూ 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

📅 21 Jan 2026 ⏱️ 2:32 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

గుగులోత్ ఆనంద్ మండల నాయకులు, జాటోత్ వైష్ణవి జూనియర్ కళాశాల యూనిట్ కార్యదర్శి

పయనించె సూర్యుడు జనవరి 21(పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి :ఖమ్మం పట్టణంలో జనవరి 23,24,25 తేదీలలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పిడిఎస్ యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 23వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టేకులపల్లి మండల నాయకులు గగులోత్ ఆనంద్, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల యూనిట్ కార్యదర్శి జాటోత్ వైష్ణవి మాట్లాడుతూ 53 ఏళ్ల త్యాగాల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ) 23వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరారు, రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల మన ఊరు మనబడి నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు, కాంట్రాక్టర్లు రోడ్లపై ధర్నాలు చేయడం, పనులు మధ్యలోనే ఆగిపోవడం కాంగ్రెస్ సర్కార్ అసమర్ధ పనితీరుకు నిదర్శనం అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించినప్పటికీ పనులు నత్త నడకన సాగుతున్నాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేయబోమని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తగు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలనీ, కేజీబీవీ లలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఏటేటా ప్రభుత్వం కావాలనే కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకొనే పేద విద్యార్థుల చదువుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. బిగి పిడికిలి జెండా ఔన్నత్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ మహాసభలలో అనేక రాష్ట్ర విద్యారంగ సమస్యలు చర్చించనున్నట్లు, పలు తీర్మానాలు చేసి భవిష్యత్తు కర్తవ్యాలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బి హన్సిక, బి సింధు, గుగులోత్ దేవా, అజ్మీర కౌశిక్, వాంకుడోత్ మోహన్ లాల్, అఖిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top