“”గోళ్ళ రాజేష్ సహకారంతో 30 మంది నిరుద్యోగులకు నిరుద్యోగ వికాస భృతి పంపిణీ.”
పయనించే సూర్యుడు జనవరి 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గసభ్యులు, 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్..
ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న, భారతరత్న, నోబుల్ శాంతి గ్రహీత మదర్ థెరిస్సా స్పూర్తితో గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో 30 మంది నిరుద్యోగులకు నిరుద్యోగ వికాస భృతిని బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గసభ్యులు, 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ పాల్గొన్నారు. గోళ్ళ రాజేష్ కార్యక్రమాల సమన్వయకర్త, నంద్యాల పట్టణ ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు నూర్ బాషా మాట్లాడుతూ నంద్యాలలోని స్థానిక ఆనంద్ కాంప్లెక్స్ లోని కార్యాలయంలో గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసుకుని మూడు సంవత్సరాలుగా ఎలాంటి ఉపాధి లేక ఉన్న యువతకు ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ వికాస భృతి పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు 2000 రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ గోళ్ళ రాజేష్ తనవంతుగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. కౌలు రైతులకు ఒక్కొక్కరికి 3 వేలు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ఒక్కొక్కరికి 2 వేలు, నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 2 వేల చొప్పున ఇవ్వడం మాములు విషయం కాదన్నారు. ఇదే స్పూర్తితో మరి కొందరు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తారని ఆయన పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం నంద్యాలను వదిలి వెళ్ళినా తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని నంద్యాల ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. ఇటీవల వికలాంగులకు 60 మందికి ఒక్కొక్కరికి 2000 చొప్పున పెన్షన్లు అందజేయడం, మున్సిపల్ టౌన్ హాల్లో మంగళవారం జరిగిన కృత్తిమ అవయవ పరికరాల పంపిణీ కార్యక్రమంలో కూడా తన వంతు కర్తవ్యంగా 30 వేల రూపాయలు సాయం చేశాడని ఆయన వివరించారు. నంద్యాల ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపినట్లు శ్యాంసుందర్ లాల్ పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గసభ్యులు ఉస్మాన్ బాషా మాట్లాడుతూ గోళ్ళ రాజేష్ రెండు నెలల్లోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నంద్యాల ప్రజల ఆదరాభిమానాలు, అభిమానం చూరగొన్నారని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు.
