కెసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపుతో ప్రజల గుండెల్లోని స్థానం తొలగించలేరు: మాధవరం రోజా దేవి
జనం న్యూస్ ఫిబ్రవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన చర్యను ఖండిస్తూ, శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కాలనీ డివిజన్ పార్టీ కార్యాలయం నుంచి స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వడ్డేపల్లి ఎంక్లేవ్ వద్దకు చేరుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.అనంతరం కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్‌కు బయలుదేరారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాధవరం రోజా దేవి మాట్లాడుతూ,“కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పక్కన పెట్టి, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది. కేసీఆర్‌పై జరుగుతున్న ఈ దుష్ప్రచారం రాజకీయ కక్షతో చేసినదే. ఇలాంటి చర్యలతో ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ స్థానం తొలగించడం అసాధ్యం” అని స్పష్టం చేశారు.అలాగే, “ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల మదిలో చెరిగిపోనివి. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం” అని ఆమె హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
