PS Telugu News
Epaper

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

📅 10 Feb 2026 ⏱️ 7:17 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు..

ఓటర్లు స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి..

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 10(పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 106 వార్డులు ఉండగా, 1,85,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందులో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు – 1,34,775 మంది ఓటర్లు, అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు – 16,850 మంది ఓటర్లు, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు – 33,723 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.పోలింగ్ నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 90 పోలింగ్ లొకేషన్లలో 288 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో 49 సున్నితమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు లేవని చెప్పారు. అయితే, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 4 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 345 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,036 మంది ఇతర పోలింగ్ అధికారులు (రిజర్వ్‌తో కలిపి) నియమించామని చెప్పారు. అదేవిధంగా 48 మంది రిటర్నింగ్ అధికారులు, 48 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియమించామని, కౌంటింగ్ సిబ్బందిని ముందుగానే గుర్తించి అవసరమైన శిక్షణ అందించినట్లు వెల్లడించారు.కౌంటింగ్ నిర్వహణ కోసం జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి నోటిఫై చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాల, ఇల్లందు మున్సిపాలిటీకి సింగరేణి కమ్యూనిటీ హాల్ (24 ఏరియా), అశ్వరావుపేట మున్సిపాలిటీకి వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేటలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంగణాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.బ్యాలట్ బాక్సులు, బ్యాలట్ పేపర్లు సహా ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ పూర్తయ్యిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై పర్యవేక్షణ కోసం ఎంచుకున్న పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 31 జోనల్ అధికారులు, 8 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 10 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్‌ఎస్‌టీలు) ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని చెప్పారు. సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ నిబంధనలు అమలులో ఉన్నాయని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రేపు పోలింగ్ జరిగే మున్సిపాలిటీ ప్రాంతాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి అర్హత కలిగిన ఓటరు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగస్వాములవ్వాలని ఆయన కోరారు.ఎన్నికల నిర్వహణలో ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికార యంత్రాంగం సమన్వయంతో సహకరించి మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విజ్ఞప్తి చేశారు.

Scroll to Top