భైంసాలో రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ –ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
భైంసా పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద వ్యవసాయ యాంత్రికరణ పథకం కింద రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందజేశారు. భైంసా, కుంటాల, కుభీర్ మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులకు స్ప్రే పంపులు, రోటవేటర్లు తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. వ్యవసాయ యాంత్రికరణ ద్వారా రైతులపై పడుతున్న కార్మిక వ్యయం తగ్గడంతో పాటు సాగు పనులు వేగంగా పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకత పెంపొందించుకోవచ్చని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే చిన్న, మధ్య తరహా రైతులు కూడా ఆర్థికంగా బలపడతారని ఆయన అన్నారు.పెరుగుతున్న సాగు ఖర్చులు, కార్మికుల కొరత వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యాంత్రికరణ పరికరాలను సబ్సిడీపై అందిస్తోందని తెలిపారు. పరికరాల పంపిణీతో పాటు వాటి వినియోగంపై అవగాహన, సాంకేతిక సహాయం కూడా రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.