ఎండిన పులికాట్ ఆకలితో అల్లాడుతున్న వలస పక్షులు
పయనించే సూర్యుడు మార్చి 27 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలో పులికాట్ సరస్సు ఈ మార్చి నెలకే ఎండబడి ఎడారిని తలపించే స్థితికి చేరుకుంది. వేల కిలోమీటర్లు దాటి ఆశగా చేరిన విదేశీ వలస పక్షులకు ఇక్కడ ఆకలి, నిరాశ మాత్రమే ఎదురవుతోంది. ఒకప్పుడు నీటితో నిండిపోయి పక్షుల కిలకిలారావాలతో కళకళలాడిన సరస్సు, ఇప్పుడు పగుళ్లు పడిన నేలతో వెలవెలబోతున్న దృశ్యాన్ని చూపిస్తోంది. సరస్సులో నీటి మట్టం తీవ్రంగా పడిపోవడంతో చేపలు, సూక్ష్మ జీవాలు గణనీయంగా తగ్గిపోయి పక్షులకు ఆహారం కొరత ఏర్పడింది. ఫ్లెమింగోలు, పెలికాన్లు వంటి వలస విహంగాలు మిగిలిన చిన్న నీటి గుంటల వద్ద గుంపులుగా తిరుగుతూ ఆహారం కోసం తీవ్రంగా తంటాలు పడుతున్నాయి సరస్సులోకి సముద్రం నుంచి చేరే ముఖద్వారాలు పూడికతో మూసుకుపోవడం వల్ల నీటి ప్రవాహం క్రమంగా తగ్గిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విస్తార ప్రాంతాలు ముందుగానే ఎండిపోవడంతో పక్షులు సమీప ప్రాంతాలకు వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నప్పటికీ, సరస్సు సంరక్షణపై తగిన చర్యలు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పులికాట్ సరస్సు వలస పక్షులకు మాత్రమే కాకుండా స్థానిక మత్స్యకార కుటుంబాల జీవనాధారంగా ఉండటంతో ఈ పరిస్థితి వారిపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సరస్సు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
