కూటమి ప్రభుత్వం “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” ముమ్మిడివరం నియోజకవర్గం పల్లెపాలెంలో ప్రారంభం.
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం మండలం పల్లెపాలెం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్ అందించే “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఈరోజు లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సూర్య ఘర్ యోజన ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. సోలార్ విద్యుత్ వినియోగం పెరగడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లు అశోక్ ముమ్మిడివరం సీనియర్ నాయకులు తాడి నరసింహారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు మరియు మీడియా మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
