గుండెగాం గ్రామానికి వెంటనే పునరావాసం కల్పించాలిహామీలకే పరిమితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండెగాం గ్రామం పునరావాసం కోసం గత పది సంవత్సరాలుగా గ్రామ ప్రజలు ఎన్నో ధర్నాలు, ఆందోళనలు, వినతిపత్రాలు సమర్పిస్తూ ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నప్పటికీ ఇప్పటికీ పునరావాసం కల్పించని పరిస్థితి నెలకొంది.ఎన్నోసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వివరించినప్పటికీ, పత్రికా ప్రకటనలు, హామీలకే పరిమితమయ్యారు తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదు.గుండెగాం ముంపు ప్రాంతంగా మారిన నేపథ్యంలో గతంలో ముథోల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విట్టల్ రెడ్డి గారు మూడు నెలల్లోనే పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు సిద్దూర్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించాలని సూచించారు.అయితే వర్షాకాలం వచ్చిందంటే గుండెగాం గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సిద్దూర్ ఎక్స్ రోడ్ వద్ద కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా సరైన వసతులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు చేరడం, కనీస మౌలిక వసతులు సరిగా లేకపోవడం వల్ల ప్రజల జీవనం దుర్భరంగా మారింది.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా గుండెగాం గ్రామ ప్రజల సమస్యను తీవ్రంగా పరిగణించి, వెంటనే శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను.ప్రభుత్వం తక్షణమే స్పందించి పునరావాస ప్రక్రియను ప్రారంభించకపోతే, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నాలు, కలెక్టరేట్ వద్ద ఆందోళనలు నిర్వహించడంతో పాటు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాలకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగాగుండెగాం గ్రామ యువకుడు నామత్కర్ నవీన్, మరియు గ్రామస్తులు అన్నారు.