కస్టమర్ల ఆదరణే వ్యాపార విజయానికి అసలు బలం
నాణ్యమైన సేవలు, అందుబాటు ధరలతోనే ప్రజల విశ్వాసం సాధ్యం: టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వ్యాపార రంగంలో విజయానికి కేవలం పెట్టుబడులు, ఆధునిక సదుపాయాలు మాత్రమే సరిపోవని, కస్టమర్ల ఆదరణ, విశ్వాసమే అసలైన విజయ రహస్యమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తనయ డాక్టర్ సరిత ఆధ్వర్యంలో నిజాంపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన “ద స్కిన్ ఎట్లయర్” క్లినిక్‌ను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి బండి రమేష్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్లినిక్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన బండి రమేష్, ప్రజలకు అవసరమైన వైద్య సేవలను నాణ్యతతో అందించడమే కాకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో సేవలు అందించినప్పుడే సంస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.ప్రస్తుతం వైద్య సేవల రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో సేవల నాణ్యత, పారదర్శకత, రోగుల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి ఎంతో కీలకమని ఆయన అన్నారు. కస్టమర్ల అవసరాలను గుర్తించి వారికి మెరుగైన సేవలు అందిస్తూ వారి ఆదరణను చూరగొంటే వ్యాపారం స్థిరమైన విజయాన్ని సాధిస్తుందని బండి రమేష్ పేర్కొన్నారు.నూతనంగా ప్రారంభమైన “ద స్కిన్ ఎట్లయర్” క్లినిక్ ప్రజలకు నాణ్యమైన చర్మ వైద్య సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్లినిక్ నిర్వాహకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.