బాలాజీనగర్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు
ప్రజా సేవలో వైఎస్సార్‌ది చెరగని ముద్ర: నాయకుల నివాళి
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, స్థానికులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాధు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నాయకుడని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా పేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని నాయకులు గుర్తుచేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల కోసం ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను స్మరించుకున్నారు. ప్రజలు వైఎస్సార్‌ను దైవంగా భావించే స్థాయిలో ఆయన సేవలు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బి. సంజీవరావు, భరత్‌నగర్ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిల్ల వెంకటేష్ యాదవ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.