ఆంధ్రప్రదేశ్

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం , వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం , వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.

పయనించే సూర్యుడుD. 18.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. అత్యవసరమైతే తప్ప పొగమంచు సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి ప్రయాణంలో తొందరపాటు వద్దు – మీ భద్రతే మీ కుటుంబానికి భరోసా: పోలీస్ కమిషనర్ వెల్లడి శీతాకాలం నేపథ్యంలో రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని , పొగమంచు సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం అధికంగా ఉంటుందని * నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ .,* సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా పొగమంచు సమయంలో ప్రయాణాలు చేయకుండా వాయిదా వేసుకోవాలని , తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో తెల్లవారుజామున రహదారులపై దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని , దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలు , రహదారిపై ఉన్న అడ్డంకులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొగమంచు సమయంలో వాహనాల లైట్లు వెలిగించినప్పటికీ ఎదురుగా ఉన్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవచ్చని , ఇలాంటి పరిస్థితుల్లో అధిక వేగంతో ప్రయాణించడం ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వాహనాలు అదుపుతప్పడం , బోల్తా పడటం , ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. కాబట్టి వాహనదారులు వేగాన్ని తగ్గించి , ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటిస్తూ ప్రయాణించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు: అత్యవసరమైతే తప్ప దట్టమైన పొగమంచు సమయంలో ప్రయాణాలు చేయవద్దు. ప్రయాణించాల్సి వస్తే వాహన వేగాన్ని గణనీయంగా తగ్గించి నెమ్మదిగా వెళ్లాలి. పొగమంచు సమయంలో లో-బీమ్ హెడ్‌లైట్లు ఉపయోగించాలి. అవసరమైనప్పుడు ఫాగ్ లైట్లు వినియోగించాలి. వాహనాల హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఇండికేటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ప్రతి వాహనానికి ముందు, వెనుక భాగాల్లో రేడియం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటించాలి. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం , ఓవర్‌టేక్ చేయడం వంటివి చేయకూడదు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి. కార్లు , ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించకూడదు. అలసటగా ఉన్నప్పుడు ప్రయాణం చేయకూడదు. పొగమంచు కారణంగా రహదారి కనిపించని పరిస్థితుల్లో సురక్షితమైన ప్రదేశంలో వాహనాన్ని నిలిపి , పరిస్థితులు అనుకూలించిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ , అప్రమత్తంగా ప్రయాణించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పోలీస్ కమిషనర్ తెలిపారు. వాహనదారులు తమ ప్రాణాలకే కాకుండా రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా బాధ్యత వహించాలని సూచించారు. ప్రయాణంలో తొందరపాటు వద్దు , గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవడమే ముఖ్యం – మీ భద్రతే మీ కుటుంబానికి భరోసా.

    ఇ-పేపర్

    PAYANINCHE SURYUDU NEWS