పయనించే సూర్యుడుD. 17.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. డీఎంఎఫ్ నిధులతో కోర్టు ఆవరణలో నాలుగు అభివృద్ధి పనులుభీంగల్: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కృషితో భీంగల్ మండల కేంద్రంలోని కోర్టు ఆవరణ అభివృద్ధికి జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్) నుంచి రూ. 18.45 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ఈ నెల 4న పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు. మండల పరిషత్ కార్యాలయం సమర్పించిన ప్రతిపాదనల మేరకు కోర్టు ఆవరణలో నాలుగు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం, షెడ్ ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం కల్పనకు రూ.5 లక్షలు, మరో షెడ్ నిర్మాణానికి రూ.5 లక్షలు, గ్రావెల్ రోడ్డు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, ప్రీకాస్ట్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.45 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం రూ. 18.45 లక్షలతో చేపట్టనున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. పనుల పురోగతిని అధికారులు పర్యవేక్షించడంతో పాటు ఖర్చుల వివరాలు, పనుల ఫొటోలను డీఎంఎఫ్ వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వివరించారు. భీంగల్ కోర్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు ఈ సందర్భంగా మల్లెల లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.