జనసేన, బీజేపీలకు కలిపి 14 వార్డులు – 12 జనసేన, 2 బీజేపీకి కేటాయింపుపై ఒప్పందం కుదిరినట్లు సమాచారం
పయనించే సూర్యుడు అక్టోబర్ 17, ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: అమలాపురం పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య కీలక సమన్వయ సమావేశం అమలాపురంలో జరిగింది. అమలాపురం పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణ టీడీపీ నాయకులకు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఐక్యతే ప్రధాన బలమని, పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పని చేయాలని ఎంపీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కీలక ఒప్పందం కుదిరింది. జనసేన నియోజకవర్గ పరిశీలకులు, గన్నవరం నియోజవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కొత్తపేట ఇంచార్జి బండారు శ్రీను, మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల సతీష్, జనసేన అమలాపురం ఎన్నికల ఇంచార్జిలు నల్లా శ్రీధర్, చిక్కం భీముడు లతో తెలుగుదేశం అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ సానా సతీష్ బాబు టిడిపి ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం అమలాపురం మున్సిపాలిటీలోని మొత్తం వార్డుల్లో జనసేన, బీజేపీలకు కలిపి 14 వార్డులు కేటాయించేందుకు అంగీకారం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో 12 వార్డులు జనసేనకు, 2 వార్డులు బీజేపీకి కేటాయించనున్నారు. మిగిలిన వార్డుల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఈ సీట్ల సర్దుబాటుతో కూటమిలో ఉన్న చిన్నపాటి అసంతృప్తులు తొలగిపోయాయని, అన్ని పార్టీల నాయకులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి నుండి ప్రచారం ముమ్మరం చేయాలని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ సానా సతీష్ బాబు నాయకులకు సూచించారు. కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి అమలాపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.