భర్త ఎఫైర్ వివాదం – భార్య బంధువుల దాడి, ఘర్షణలో తుది పరిణామం!
పయనించే సూర్యుడు న్యూస్ :భర్త వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో పెను రచ్చకు కారణమైంది. ఏకంగా వేటకొడవళ్లతో దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఘటనలో భర్త తరఫున కుటుంబ సభ్యులు ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.. వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సంజాపూర్ ఏరియాకు చెందిన గుర్రం మల్లేష్ కు రెండెళ్ల క్రితం వెల్దండ మండలంలోని చెర్కూర్ గ్రామానికి చెందిన శిరీష తో వివాహం జరిగింది. వీరికి ఒక ఆడబిడ్డ సంతానం కలిగింది. అయితే అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో పెళ్లికి ముందు భర్త ప్రేమ వ్యవహారం చిచ్చు రేపింది. కల్వకుర్తి పట్టణంలోని సిలార్ పల్లికి చెందిన ఓ యువతి తో మల్లేష్ లవ్ స్టోరీ నడిపించాడు. అయితే కారణాలు తెలియదు కానీ.. తల్లిదండ్రులు చూసిన సంబంధం శిరీషను మాత్రం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మల్లేష్, సదరు యువతితో వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. అంతేకాదు మూడు నెలల క్రితం ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మల్లేష్ వ్యవహారంపై శిరీషకు నచ్చచెప్పారు. అయితే మళ్లీ ఇటీవలె మరోసారి ప్రేయసితో మల్లేష్ వెళ్లిపోయాడు. మరోసారి పంచాయితీ పెట్టగా ఈ సారి తాను ప్రేమించిన యువతితోనే ఉంటానని అందరిముందు స్పష్టం చేశాడు.దీంతో విషయం మరింత ముదరడంతో ఎటూ తేలక శిరీష అమ్మగారి ఇంటి వద్దే ఉంటోంది. అయితే మొదటిసారి పంచాయితీ పెట్టిన క్రమంలో శిరీష, మల్లేష్ లకు జన్మించిన కూతురు పేరు మీద ఎకరంన్నర భూమి రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా ఇటు భార్య, కూతురుతో కలిసి ఉండక, ఒప్పందం ప్రకారం భూమి ఇవ్వకపోవడంతో శిరీష కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడదామని వెళ్లి ఘర్షణ పడ్డారు. శిరీష కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేష్ తండ్రి జంగమయ్య, తల్లి అలివేలు, తమ్ముడు పరమేశ్ లపై వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా… పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.