PS Telugu News
Epaper

అమెరికా ‘యుద్ధ సిద్ధం’ –హై అలర్ట్‌

📅 06 Nov 2025 ⏱️ 1:29 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఏ క్షణాన్నైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది. ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో వెనిజుయెలాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌ కరీబియన్‌ సముద్ర జలాల్లో డ్రగ్స్‌ను తరలిస్తున్న పడవల పై దాడులు చేయించారు. యుద్ధ నౌక ‘యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ’ను వెనిజుయెలా సమీపానికి తీసుకెళ్లడం ద్వారా ఆ దేశంపై అమెరికా ఒత్తిడి పెంచింది. అమెరికా ప్రభుత్వం తనపై యుద్ధం చేస్తోందని వెనిజుయెలా అధ్యక్షుడు మదురో ఆరోపించారు. ట్రంప్‌ యంత్రాంగం మాదకద్రవ్యాల విషయంలో అతిశయోక్తులతో తప్పుడు కథనాలను అల్లుతోందనీ మదురో జాతీయ మీడియాతో అన్నారు. డ్రగ్స్‌ను సముద్రంలో పట్టుకొని.. నిందితులను అరెస్టు చేయడానికి ఇంత భారీ సంఖ్యలో యుద్ధనౌకలు, ఫైటర్‌జెట్‌లు అవసరమా? అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే వెనిజుయెలా నుంచి మాదకద్రవ్యాల ముఠాలు పనిచేస్తున్నాయన్న ట్రంప్‌ ఆరోపణల్లో నిజం ఉంది. దళాలకు దొరికినప్పుడు సముద్రంలో పారబోసే కొకైన్‌ దెబ్బకు అక్కడి షార్క్‌ చేపల్లో కూడా దాని ఆనవాళ్లుంటున్నాయంటే అక్రమ రవాణ స్థాయి ఎంతో అర్థం చేసుకోవచ్చు. కానీ, వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజుయెలాలో ఉన్నాయి. ఇవి సౌదీలో నిల్వల కంటే ఎక్కువ. ట్రంప్‌ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ‘వెనిజుయెలాలో చమురు రిజర్వులను అమెరికా స్వాధీనం చేసుకోవాలి’ అన్నారు. ‘‘వాళ్ల వద్ద చాలా చమురు ఉంది. భౌగోళికంగా మనకు చాలా దగ్గర’’ అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా మదురో సర్కారును కూల్చేందుకు ట్రంప్‌ ప్రయత్నించారు. అప్పట్లో పలువురు మంత్రులు ట్రంప్‌ ఆలోచనను వ్యతిరేకించారు. చైనా మాత్రం అమెరికా ఆంక్షలకు భయపడకుండా వెనిజుయెలాలో 212 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో 90 శాతం బీజింగ్‌ కొంటోంది. భారత్‌ ఈ దేశం నుంచి కొన్నేళ్లు చమురు కొన్నా.. ఆంక్షలకు భయపడి బాగా తగ్గించేసింది. అమెరికాతో పోలిస్తే వెనిజుయెలా సైన్యం చాలా చిన్నది. చైనా, రష్యాతో దగ్గరి సంబంధాలున్నా.. భౌగోళికంగా దూరంగా ఉండటంతో అవి ఎంతవరకు వెనిజుయెలాను ఆదుకుంటాయో చెప్పలేని పరిస్థితి.

Scroll to Top