వందేభారత్ స్పీడ్ షాక్: గ్లాసులో నీరు కదలడం లేదు
పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలో నగరాలను కలుపుతూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలో స్లీపర్ క్లాస్ వందేభారత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ రెడీ అవుతోంది. ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రోహల్ఖుర్ద్-ఇంద్రఘర్-కోట సెక్షన్‌లో ట్రయల్ రన్ నిర్వహించారు. రైలు స్థిరత్వం, బ్రేకింగ్, ప్రయాణ అనుభవాన్ని పరీక్షించేందుకు లోడ్‌తో పాటు ఖాళీగానూ టెస్టింగ్ నిర్వహించారు. రైలు గంటకు 180 కిలోమీటర్ల టాప్‌స్పీడ్ అందుకుంది. అప్పుడు ‘వాటర్ టెస్ట్’ కూడా చేసారు. రైలు మాక్సిమమ్ స్పీడ్‌తో వెళుతున్నప్పుడు మూడు గాజు గ్లాసులతో నీటిని ఉంచారు. మూడు గాజు గ్లాసులలో నీరు ఏ మాత్రం తొణకలేదు. మూడు గ్లాసులను ఒకదానిపై ఒకటి ఉంచినప్పుడు కూడా గ్లాసులు కిందపడలేదు. ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇండియన్ రైల్వే పనితీరు పై నెటిజన్లు ప్రశంసించారు. వందేభారత్ స్లీపర్ రైలులో ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కామెంట్లు పెట్టారు.