PS Telugu News
Epaper

బాలీవుడ్ లో మరో విషాదం: కామినీ కౌశల్ కన్నుమూత

📅 15 Nov 2025 ⏱️ 2:41 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి, బాలీవుడ్ తొలితరం నటులలో ఒకరైన కామినీ కౌశల్ కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. కామిని కౌశల్ అసలు పేరు ఉమా కశ్యప్.. లాహోర్‌లో జన్మించారు. 1946లో దర్శకుడు చేతన్ ఆనంద్‘ నీచా నగర్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. తొలి చిత్రమే కేన్స్‌ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, అశోక్ కుమార్, రాజ్ ఆనంద్ వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ‘ఆగ్’,‘నదియా కే పార్’,‘దో భాయ్’ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు. 1940వ దశకంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటీనటుల్లో ఒకరిగా నిలిచారు.కౌమినీ కౌశల్ హీరోయిన్‌గా రిటైర్ అయిన తర్వాత, మళ్లీ తిరిగి 1963లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ‘రోటీ కపడా ఔర్ మకాన్’, ‘పురబ్ ఔర్ పశ్చిమ’,వంటి సినిమాల్లో తల్లి పాత్రలలో నటించి ఆకట్టుకున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో అమ్మమ్మగా, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో అతిథి పాత్రలో నటించి నేటి తరం ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.ఇక, ఆమె వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో ధైర్యశాలి. ఆమె అక్క మరణానంతరం అక్క ఇద్దరి పిల్లల బాధ్యతను తీసుకునేందుకు తన బావనే వివాహం చేసుకున్నారు. నటనకే పరిమితం కాకుండా.. ఇటు పిల్లల కోసం కథలు రాయడం, తోలు బొమ్మలతో టీవీ కార్యక్రమాలు వంటివి చేశారు. ఆమె ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌ సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.  కౌమినీ కౌశల్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.



Scroll to Top