తీవ్ర చలి పరిస్థితుల్లో వర్షాల అవకాశం: వాతావరణశాఖ విశ్లేషణ
పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తున్న వేళ వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని IMD చెబుతోంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్ప పీడనంతో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన చేశారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే తిరుపతి, తిరుచానూరు, తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి తోడు తిరుమల కొండపై విపరీతంగా చలి గాలులు వీస్తున్నాయి. వర్షం కారణంగా దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వాతావరణం మారింది. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంనే వెదర్ మారిందంటున్నారు అధికారులు. పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ అయింది. తీరప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. పుదుచ్చేరి, కారేకాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నంలో అత్యధికంగా 16 సెం.మీ వర్షపాతం నమోదయింది.