పుట్టపర్తికి చేరుకున్న మోదీ—సత్యసాయి స్మారక నాణెం విడుదల కార్యక్రమం
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పుట్టపర్తి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. వారితో పాటు మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు. అనంతరం హిల్ వ్యూ ఆడిటోరియానికి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయిబాబా స్మారక నాణెం, స్టాంప్ విడుదల చేయనున్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా రూ.100 నాణెంతో పాటు నాలుగు స్టాంప్ విడుదల చేయనున్నారు. ఇందులో ఓ వైపు సత్యసాయిబాబా చిత్రం, మరోవైపు అశోక స్తంభం ఉండనుంది. అదే విధంగా త్వరలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా నాణెం విక్రయించనున్నారు. కాగా, పుట్టపర్తిలో జరగనున్న ప్రధాని మోదీ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు.