విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమా…?
ఇకనుండి రాజకీయ పతనం మొదలైంది
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనకు దిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ మాట్లాడుతూ…ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,500 కోట్ల రూపాయలకు చేరుకున్నా, ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై పరోక్ష దాడి అని తీవ్రంగా విమర్శించారు.ఆయన పేర్కొన్నదేమనగా, గత మూడు రోజులుగా అనేక డిగ్రీ కళాశాలలు మూతపడినా ప్రభుత్వం కనీసం స్పందించలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆకాష్ నాయక్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం, విద్యార్థుల సమస్యల పట్ల మాత్రం అసమర్థత ప్రదర్శిస్తోందని విమర్శించారు.ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించడం, రాష్ట్ర యువతను నిరాశలోకి నెట్టే దిశగా ఉంది. వెంటనే విద్యా వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించాలి. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థి సమాజం తగిన గుణపాఠం చెబుతుంది అని ఆకాష్ నాయక్ హెచ్చరించారు.ఈ ఆందోళనలో పాల్గొన్న నాయకుల్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు నరేష్ రాథోడ్, అనిల్ నాయక్, పవన్ నాయక్, మనోజ్, గణేష్, మాణిక్యం, మహేష్ తదితరులు ఉన్నారు.
